Telangana CS Shanti kumari : ‘ఎన్నో సవాళ్లతో కూడిన వృత్తిలో నిలబడగలిగానంటే భగవంతుడిపై ఉన్న నమ్మకం, ప్రేమ.. అవి ప్రసాదించిన శక్తి ద్వారానే అని నా నమ్మకం. మనం నేర్చుకున్నది పది మందికీ పంచగలిగితేనే మన ఉనికి సార్థకమవుతుందని విశ్వసిస్తా. నా మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని అందరికీ పంచుతూ.. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తా. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేలా కృషి చేస్తా’ అంటున్నారు శాంతి.
‘మహిళలు తమ గుర్తింపుకోసం ప్రయత్నించడం, తమకోసం సమయం కేటాయించుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. భర్త కోసమో, పిల్లల కోసమో.. అవసరం ఉన్నా లేకున్నా త్యాగాలు చేయడం మహిళలకు అలవాటు. దాన్ని మానుకోవాలి. అలా ప్రతిసారీ చేస్తూ పోతుంటే.. కుటుంబంలో వారి స్థానం వెనకే’ అన్న సలహానీ ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. రాష్ట్రంలోనే అత్యున్నత కార్యనిర్వాహక పదవి! దేశంలోని 28 రాష్ట్రాల్లో అయిదింటిలోనే మహిళలు ఈ హోదాలో ఉన్నారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా వారి సరసన శాంతికుమారి కూడా చేరారు.
ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేశారు:మెరైన్ బయాలజీలో పీజీ, అమెరికాలో ఎంబీఏ పూర్తిచేసిన శాంతి కుమారి ప్రజాసేవలోకి రావాలనుకున్నారు. అందుకోసం ఎంతో శ్రమించి ఐఏఎస్ సాధించారు. అప్పటికి ఆవిడ వయసు 24 ఏళ్లే! మొదటి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని చేరుకున్నావిడ ఎక్కడ పనిచేసినా తన ముద్ర కనబరిచారు. సహాయ కలెక్టర్‌గా క్షేత్ర పర్యటనలతో ప్రజల జీవనాన్ని దగ్గరగా గమనించారు. సాయానికి చేయందించే ఆవిడ.. అన్యాయాన్ని సహించలేరు.