ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ జాతీయ సగటు కంటే ఎంతో మిన్నగా.. దక్షిణాదిలో అగ్రస్థానంలో ఉంటోంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం ఉంటున్నా రాష్ట్రం మాత్రం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. దేశ జీడీపీ 3 శాతం తగ్గగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) 2.4 శాతం పెరిగింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై అర్థగణాంక శాఖ బుధవారం నివేదికలను విడుదల చేసింది. ఆవిర్భావం నుంచీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా అభివృద్ధి, జీడీపీలో తెలంగాణ వాటా తదితర అంశాలను నివేదికల్లో విశ్లేషించారు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 18.5 శాతం వృద్ధి
వ్యవసాయ అనుబంధ రంగాల్లో జాతీయ స్థాయిలో 6.6 శాతం వృద్ధి రేటు ఉండగా తెలంగాణ 18.5 శాతంతో ముందుంది. 2015-16 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ సగటు వృద్ధిరేటు తెలంగాణలో 11.7 శాతం ఉండగా జాతీయస్థాయిలో ఇది 8.1 శాతం మాత్రమే. జీఎస్‌డీపీ వృద్ధి రేటులో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్‌డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. 2014-15 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ దేశ జీడీపీలో 28.4 శాతం వృద్ధి రేటు ఉండగా తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి రేటు 54.8 శాతం ఉంది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో రాష్ట్రంలో 2014లో దేశంలో 11వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం మూడో స్థానానికి చేరింది. తెలంగాణలో వరి, పత్తి, కంది పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. ధాన్యం ఉత్పత్తి ఏడేళ్లలో అయిదు రెట్లు పెరగగా, పత్తి దిగుబడి మూడు రెట్లు పెరిగింది. రైతు బంధు, గొర్రెల పంపిణీ, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంతో రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీఎస్‌వీఏ) వాటా గణనీయంగా పెరిగింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధికి మార్గం సుగమమైంది. జీఎస్‌వీఏలో అనుబంధ రంగాల వాటా 59.4 శాతం ఉంది. విద్యుత్, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగంలో పెట్టుబడులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.