తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ పంచాయతీరాజ్​ అవార్డుల్లో రాష్ట్రానికి ప్రథమ స్థానం.. ఈసారి ఏకంగా 8.. - దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం

Deen Dayal Upadhyaya Panchayat Vikas Awards 2023: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీరాజ్​ అవార్డుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 27 అవార్డులు ప్రకటిస్తే.. అందులో ఏకంగా ఎనిమిది అవార్డులను రాష్ట్రం కైవసం చేసుకుంది. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్​రావు.. ట్విటర్​ వేదికగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, అధికారులకు అభినందనలు తెలిపారు.

panchyar raj awards
panchyar raj awards

By

Published : Apr 7, 2023, 3:51 PM IST

Updated : Apr 7, 2023, 8:19 PM IST

Deen Dayal Upadhyaya Panchayat Vikas Awards 2023: జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సత్తా చాటింది. 2023 సంవత్సరం దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు 27 అవార్డులు ప్రకటిస్తే అందులో ఏకంగా 8 అవార్డులు రాష్ట్రానికి దక్కడం విశేషం. అలాగే అన్ని రాష్ట్రాలకు కలిసి కేంద్ర పంచాయతీరాజ్​ అవార్డులు 46 ప్రకటిస్తే.. తెలంగాణకు ఏకంగా 13 అవార్డులు దక్కాయి.

అవార్డులు లభించిన కేటగిరీలు, జిల్లాలు:

1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ హెల్తీ పంచాయతీ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది.

2. జనగామ జిల్లా నెల్లుట్ల వాటర్ సఫిషియెంట్ పంచాయతీ విభాగంలో తొలి స్థానం దక్కించుకొంది.

3. మహబూబ్ నగర్ జిల్లా కొంగట్​పల్లి సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది.

4. సూర్యాపేట జిల్లా ఐపూర్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలో అగ్రస్థానాన నిలిచింది.

5. జోగులాంబ గద్వాల జిల్లా మాన్ దొడ్డి పావర్టీ ఫ్రీ విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకొంది.

6. వికారాబాద్ జిల్లా చీమల్ దర్రి పంచాయతీ గుడ్ గవర్నెన్స్ విభాగంలో రెండో స్థానం పొందింది.

7. పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా మూడో స్థానంలో నిలిచింది.

8. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫ్రా విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.

ప్రత్యేక కేటగిరీల్లోనూ రాష్ట్ర పంచాయతీలు పలు అవార్డులు: నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో రెండు రాష్ట్రానికి లభించాయి. ఉత్తమ బ్లాక్ కేటగిరీలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రెండో స్థానంలో నిలిచింది. ఉత్తమ జిల్లా కేటగిరీలో ములుగు జిల్లాకు రెండో స్థానం దక్కింది. గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా-కే మూడో స్థానంలో నిలిచింది. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ కేటగిరీ రంగారెడ్డి జిల్లా కన్హా రెండో స్థానం సాధించింది. గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ మరో విభాగంలో మొదటి స్థానంలో గజ్వేల్ జిల్లా ఎర్రవెల్లి మొదటి స్థానాన్ని పొందింది. ఈ నెల 17వ తేదీన దిల్లీ వేదికగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేస్తారు.

కేసీఆర్​ మానసపుత్రిక పల్లె ప్రగతితోనే గుర్తింపు.. కేటీఆర్​​: కేంద్రస్థాయిలో జాతీయ పంచాయతీరాజ్​ అవార్డుల్లో.. తెలంగాణ మరోసారి మెరిసిందని మంత్రి కేటీఆర్​ ట్విటర్​ వేదికగా తెలిపారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం.. ఉత్తమ గ్రామ పంచాయతీలు.. వంద శాతం ఓడీఎఫ్​ ప్లస్​ గ్రామాలు అన్నీ తెలంగాణలోనే ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. దార్శనికుడైన సీఎం వల్లే అద్భుతమైన పనితీరు కనబర్చినట్లు పేర్కొన్నారు. కేసీఆర్​ మానసపుత్రిక పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. పంచాయతీరాజ్​ శాఖ మంత్రి, బృందానికి మంత్రి కేటీఆర్​ అభినందనలు తెలిపారు.

ఈ అవార్డులు రావడం సీఎం దార్శనికతకు నిదర్శనం: జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 27 జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణకు ఎనిమిది అవార్డులు వచ్చాయని, నాలుగు కేటగిరీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ట్విటర్​లో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వం, గ్రామీణాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, బృందానికి అభినందనలు తెలిపారు.

తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శం: ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి వల్లే అవార్డులు దక్కాయన్న పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన తెలంగాణ మరోమారు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు కొనసాగించాలని.. మిగిలిన గ్రామాలు కూడా పట్టుదలతో పని చేసి అవార్డులు సాధించాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 7, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details