New fire Prevention Measures in Telangana : అగ్ని ప్రమాదాలు... వరదల కారణంగా ముంపు... భూకంపాలు...ఇలా విపత్తలు ఏవి సంభవించినా బాధితులను సురక్షితంగా కాపాడడంలో ముందుంటుంది అగ్నిమాపక శాఖ. ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజలను రక్షించడమే మొదటి కర్తవ్యంగా విధులు నిర్వహిస్తూ ఉంటారు ఈ శాఖ సిబ్బంది. యావత్ ప్రపంచం సాంకేతికతను ఒడిసిపడుతూ పనులను సులభతరం చేసుకుంటున్న నేపథ్యంలో దానికి తామెందుకు అందుకు మినహాయింపు అనుకుంది రాష్ట్ర అగ్నిమాపక శాఖ. ఇందుకోసం కైట్ ఐ సాంకేతికతను వినియోగించుకుంటోంది.
New Technology Equipments in Fire Department : సాధారణంగా అగ్నిప్రమాదాలు జరిగినపుడు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వీలైనంత వేగంగా చేరుకోవడం... ప్రమాదాన్ని నివారించడంలో చేయాల్సిన మొదటి పని. ప్రమాద తీవ్రతను బట్టి అగ్నిమాపక శకటం వేగంగా వెళ్లేందుకు కొన్ని సార్లు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి దారి ఇస్తారు. ఎంత వేగంగా స్పందించినా ఒక్కోసారి సిబ్బందికి ఘటనా స్థలికి వెళ్లేందుకు ఆలస్యం అవుతుంది. ఈ ఇబ్బందులు అన్నీ అధిగమించి ఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు ఉపకరించేదే కైట్ ఐ పరిజ్ఞానం. ఈ సాంకేతికతతో అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో ఏం జరుగుతోంది, అగ్నిమాపక శకటాలు మంటలను ఏ మేరకు అదుపు చేస్తున్నాయి, ఘటన స్థలానికి వెళ్తున్న శకటం ఎంత దూరంలో ఉంది తదితర ముఖ్యమైన విషయాలను ఉన్నతాధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. కైట్ ఐ సాంకేతికతతో అగ్నిమాపక సిబ్బంది పని కూడా సులభతరం అవుతుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదాల తీవ్రత కూడా తగ్గింది.
ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడానికి పరికరాలు దోహదం : రాష్ట్రంలో ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా 101 లేదా 100 కు సమాచారం వస్తుంటుంది. ఇది ముందుగా అగ్నిమాపక శాఖ కంట్రోల్ కేంద్రానికి అందుతుంది. ఇక్కడి సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతం పరిధిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందిస్తారు. అయితే గతంలో అక్కడి సిబ్బంది ఎలా స్పందించారనే దాని పై సరైన స్పష్టత ఉండేది కాదు. శకటాల సిబ్బంది ఇచ్చే సమాచారమే ఉన్నతాధికారులకు, బాధితులకు ఆధారంగా ఉండేది. అయితే కైట్ ఐ పరిజ్ఞానంతో అగ్నిమాపక కేంద్రంలో ఉండి ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షించవచ్చు. దీని ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం కూడా పెరుగుతోంది. కైట్ ఐ సాంకేతికతలో భాగంగా మొదట హైదరాబాద్ పరిధిలోని పలు శకటాలకు జీపీఎస్ పరికరాలను అమర్చారు. దీని వల్ల శకటం ఏ సమయంలో ఎక్కడుంది, ఏ వైపు ప్రయాణిస్తోంది, అసలు కదులుతుందా, ఆగి ఉందా వంటి వివరాలన్నీ ఫైర్ కంట్రోల్ కేంద్రంలో తెర పై కనిపించేలా ఏర్పాటు చేశారు. అగ్నిమాపక కేంద్రం అధికారి నుంచి డిజి వరకు చరవాణుల్లోను, మ్యాప్‌ల రూపంలోనూ ఇవన్నీ కనిపించే సదుపాయం ఇందులో ఉంది.