తెలంగాణ

telangana

ETV Bharat / state

సేద్య చట్టం... కార్పొరేట్‌ చుట్టం!.. వ్యవసాయ చట్టాలపై హరీశ్​రావు మనోగతం - central agricultural bills

వ్యవసాయం చట్టం వల్ల తెలంగాణ ప్రభుత్వ విధానానికి ,కేంద్ర ప్రభుత్వ విధానానికి మధ్య వైరుధ్యం తలెత్తుతోంది. అన్నదాతల పాదాలకు వెన్నపూసి దేశం వెన్నెముకను నిలబెడతారని ఆశించినా, వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరించే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదని పలువురు భావిస్తున్నారు. రైతును తన భూమిలో తానే కూలీగా మారిపోయేలా చేసే చట్టం ఇది అని ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. రైతు వ్యతిరేక దృక్పథంతో రూపొందించిన ఈ చట్టం ఇప్పటికే ఉన్న మద్దతు ధరను మొదట ఊడగొడుతుందని, ఆ తరువాత స్థానిక మార్కెట్లను నిర్వీర్యం చేస్తుందని భావిస్తున్నారు.

telangana finance minister harish rao comments on central agricultural bills
సేద్య చట్టం... కార్పొరేట్‌ చుట్టం!

By

Published : Oct 13, 2020, 7:25 AM IST

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల సారాంశం ఏమిటి? స్థానిక మార్కెట్లను నిర్వీర్యం చేయడం; రైతులను పరాధీనులుగా మార్చడం; రాష్ట్రాల పరిధిలోని అంశాల్లో జోక్యం చేసుకొని వాటి హక్కులను కాలరాచి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవడం! మహారాష్ట్రలో రైతులు చేసిన మహా పాదయాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. బొబ్బలెక్కి, తోలు ఊడిన రైతుల పాదాల ఫొటోలు అందరినీ కదిలించాయి. ఆ పాదాలు సంధించిన ప్రశ్నలు మరచిపోలేనివి! అన్నదాతల పాదాలకు వెన్నపూసి దేశం వెన్నెముకను నిలబెడతారని ఆశించినా, వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరించే లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. రైతును తన భూమిలో తానే కూలీగా మారిపోయేలా చేసే చట్టం ఇది. రైతు వ్యతిరేక దృక్పథంతో రూపొందించిన ఈ చట్టం ఇప్పటికే ఉన్న మద్దతు ధరను మొదట ఊడగొడుతుంది, ఆ తరవాత స్థానిక మార్కెట్లను నిర్వీర్యం చేస్తుంది.

నీరుగారుతున్న కర్షకుల ప్రయోజనాలు

ఈ చట్టం వల్ల తెలంగాణ ప్రభుత్వ విధానానికి, కేంద్ర సర్కారు విధానానికి మధ్య వైరుధ్యం తలెత్తుతున్నది. స్థానిక మార్కెట్ల బలోపేతానికి ఎన్నో చర్యలు చేపట్టి తెలంగాణ ప్రభుత్వం గుణాత్మక మార్పు తీసుకొచ్చింది. మార్కెట్‌ కమిటీలలో రిజర్వేషన్‌ విధానం ప్రవేశపెట్టింది. స్థానిక మార్కెట్ల సంఖ్యను పెంచుతూ వాటికి కావాల్సిన హంగు, సౌకర్యాలు సమకూర్చింది. గోడౌన్ల సామర్థ్యాన్ని నాలుగు లక్షలనుంచి 24లక్షల టన్నులకు పెంచింది. కరోనా కష్ట కాలంలో పండిన ప్రతి గింజను కొనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటున్నది. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణమైన పంటలు వేసేలా రైతులకు అవగాహన కలిగిస్తున్నది. రైతుల మధ్య సమన్వయం కోసం, వారు చర్చించుకోవడం కోసం ఊరూరా రైతువేదికలు నిర్మిస్తున్నది. పంట నూర్పిళ్లకోసం రైతుల పొలాల్లో ఉచితంగా కల్లాలు నిర్మిస్తున్నది. అవినీతి బెడదనుంచి రైతులకు విముక్తి కలిగిస్తూ- వారికి భూమి హక్కు స్పష్టంగా ఉండేలా కొత్త రెవిన్యూ చట్టం తెచ్చింది. పాస్‌బుక్‌ లేకుండా బ్యాంకులో పంట రుణం లభించేలా మార్పు తెచ్చింది. రైతుబంధు, రైతు బీమా రైతులకు కలిగిస్తున్న ప్రయోజనాలు తెలిసినవే. రైతులకు కలుగుతున్న ఈ ప్రయోజనాలన్నీ వట్టిపోయేలా కేంద్రం కొత్త వ్యవసాయ చట్టం తీసుకువచ్చింది.

కార్పొరేట్​ లాబీకి తలొగ్గిన కేంద్రం

పులి మీద పుట్రలా కేంద్రం- ఆహార ధాన్యాలు, ఉప్పు పప్పులు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, వంట నూనెలు తదితర వస్తువులను నిత్యావసరాల జాబితా నుంచి తొలగించింది. అంటే వాటి సేకరణ మీద ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేస్తున్నది. అక్రమంగా నిల్వ చేసుకునే అవకాశం కార్పొరేట్‌ శక్తులకు కల్పిస్తున్నది. ఇది ఎంతటి విపరిణామాలకు దారితీస్తుందో ఊహించవచ్చు. ఇది రైతులను మాత్రమే కాక వినియోగదారులను సైతం కష్టాలపాలు చేస్తుంది. దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులను కేంద్ర ప్రభుత్వ దిగుమతి చట్టం నియంత్రిస్తుంది. దేశ ప్రయోజనాలే ప్రాతిపదికగా కొన్ని వస్తువులను అనుమతిస్తుంది, మరికొన్నింటిని అనుమతించదు. అయితే కార్పొరేట్‌ లాబీ ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం దేశంలో మ(మొ)క్కజొన్నల దిగుమతిపై నిషేధాన్ని తొలగించి- దిగుమతి సుంకాన్ని 50శాతం నుంచి 15శాతానికి తగ్గించి అనుమతించింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో మక్కజొన్న సాగు ఎక్కువగా జరుగుతున్నది. దైనందిన ఆహారంగా మక్కజొన్న వినియోగం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో- మొక్కజొన్నను కోళ్ల దాణాగా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటికీ భారత్‌లో మూడు కోట్ల 52లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న నిల్వ ఉంది. దేశ అవసరాలను ఏడాదికి రెండు కోట్ల 40 లక్షల మెట్రిక్‌ టన్నులుగా గుర్తించారు. అంటే దాదాపు కోటి మెట్రిక్‌ టన్నులకుపైగా మక్కజొన్న దేశంలో అదనంగా ఉంది. మళ్ళీ ఈనెల వాన కాలం పంట రాబోతున్నది. రెండు కోట్ల నాలుగు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కోటి మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న అదనంగా ఉన్న పరిస్థితుల్లో- దాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి బదులు, అక్కడినుంచి దిగుమతి చేసుకోవడం విచిత్రం.

రైతులకు సంబంధించి ఇది మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందమే! రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర చెల్లించి కొన్న మక్కలను సబ్సిడీ ధరకు పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. మద్దతు ధరకు, సబ్సిడీకి మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇది ఎప్పటినుంచో అమలవుతున్న విధానం. దీనివల్ల ఇటు రైతులు అటు పౌల్ట్రీ యజమానులు ఇరువురికీ ప్రయోజనం చేకూరుతున్నది. దిగుమతి చేసుకుంటే పౌల్ట్రీ యాజమాన్యాలు చవకగా వచ్చే విదేశీ మక్కలను కొంటారు తప్ప- వాటిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయరు. అటువంటప్పుడు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి సేకరించే మక్కలు నిష్ప్రయోజనం అవుతాయి. మొత్తంగా మక్క సాగు సంక్షోభంలో పడుతుంది. రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇది కార్పొరేట్ల అభివృద్ధికి బంగారు మెట్టు. దేశంలోని రైతు ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. అందుకే ఈ చట్టాలమీద ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

విద్యుత్తే ప్రాణాధారం..

తెలంగాణ వ్యవసాయానికి విద్యుత్తే ప్రాణాధారం. 24లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటలు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ సమయంలో విద్యుత్తు సంస్థల నిర్వహణ- కేంద్రం పరిధిలోకి పోతే పరిస్థితి తలకిందులవుతుంది. రైతులు మళ్ళా సంక్షోభంలో చిక్కుకుంటారు. అందుకే విద్యుత్తు వ్యవస్థల నిర్వహణ రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని కేంద్రంతో తెలంగాణ పోరాడుతున్నది. డిస్కమ్‌ల నిర్వహణలో లోపాలు అనే నెపంతో విద్యుత్తు వ్యవస్థల నిర్వహణను కేంద్రం తన చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నది. తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే 0.25 శాతం రుణ పరిమితి (ఎఫ్‌ఆర్‌బీఎం) పెంచుతామని తద్వారా రూ.2,500 కోట్లు రాష్ట్రానికి లాభం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రలోభపెడుతున్నది. దేశంలోని పలు రాష్ట్రాలు- కేంద్ర ప్రతిపాదనలు తీసుకొని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించే ప్రక్రియ ప్రారంభించాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. విద్యుత్తు సంస్థల నిర్వహణ రాష్ట్రం చేతిలోనే ఉండాలని, ఎఫ్‌ఆర్‌బీఎం నిధులకు ఆశపడి కేంద్రం చేతిలో పెట్టేదే లేదని తేల్చి చెప్పారు. మీటర్లు లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ విధానమని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

విద్యుత్‌ సంస్కరణా ఆందోళనకరం

విద్యుత్తు సంస్థల నిర్వహణ కేంద్రానికి అప్పచెబితే జరిగేదేమిటి? అప్పుడు ఆయా సంస్థల విధానాలు రైతులకు సానుకూలంగా ఉండవు. లాభాలే ప్రాతిపదికగా అవి విద్యుత్‌ రంగంలో కార్పొరేట్‌ విధానాలను అమలు చేస్తాయి. అవి రైతుల పాలిట శాపంగా మారతాయి. విద్యుత్తు వినియోగాన్ని లెక్కించేందుకు మీటర్లు ప్రవేశపెట్టాలన్న కేంద్ర నిర్ణయం రైతులకు ఆందోళన కలిగిస్తున్నది. వ్యవసాయ స్వావలంబనను దెబ్బతీస్తూ, చిన్న సన్నకారు రైతాంగం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ, కార్పొరేటీకరణకు తెరచాపలెత్తుతున్న వ్యవసాయ చట్టాలను నిజమైన దేశభక్తులందరూ వ్యతిరేకించాలి. ఈ చట్టాలపై ఇప్పటికే 18 రాజకీయ పార్టీలు తమ వ్యతిరేకతను స్పష్టం చేశాయి. పంజాబ్‌ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. కేంద్రమంత్రి వర్గంనుంచి- ఎన్‌డీఏ కూటమి నుంచి అకాలీదళ్‌ వైదొలగింది. భాజపా అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్‌ సంఘ్‌ సైతం ఈ చట్టాలు రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకమని స్పష్టంగా ప్రకటించింది. మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేసింది. 250 రైతు సంఘాలతో ఏర్పడిన అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి దేశవ్యాప్తంగా అందోళనలు నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కార్పొరేట్‌ వ్యవసాయ చట్టాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నది.

--టి.హరీశ్​ రావు, రచయిత- తెలంగాణ ఆర్థికశాఖామాత్యులు

ఇవీ చూడండి:కీలక సవరణల కోసం ప్రత్యేక సమావేశం

ABOUT THE AUTHOR

...view details