తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.52,700 కోట్లు ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయండి: హరీశ్ - Harish Rao and 15th Finance Commission Chairman NK Singh meeting

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల శాతం, రుణ పరిమితిని పెంచి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆర్థిక మంత్రి హరీశ్​రావు కోరారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో కలిసి దిల్లీలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్​ ఎన్​.కె.సింగ్​తో ఆయన సమావేశమయ్యారు. కాళేశ్వరం, మిషన్​ భగీరథ నిర్వహణకు నిధులు ఇచ్చేలా చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Harish Rao meeting
15వ ఆర్థిక సంఘం ఛైర్మన్​తో మంత్రి హరీశ్​రావు భేటీ

By

Published : Jan 29, 2020, 6:17 AM IST

Updated : Jan 29, 2020, 7:33 AM IST

15వ ఆర్థిక సంఘం ఛైర్మన్​తో మంత్రి హరీశ్​రావు భేటీ

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని ఇటీవల మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ కారణంగా వచ్చే ఐదేళ్లకు రాష్ట్రాల నిధుల అంశాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు ఆయా రాష్ట్రాలతో 15వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశమవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఆర్థిక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిశోర్ ​సింగ్ సహా సభ్యులను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలను ఛైర్మన్​కు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను అందజేశారు.

రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులపై వివరణ

కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల శాతం పెంచాలని.. రుణపరిమితి పెంచి రాష్ట్రాల ఆర్థిక స్థితికి కేంద్రం ఊతమిచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులను ఆర్థిక సంఘం ఛైర్మన్ ప్రశంసించారన్న హారీశ్​రావు... మిషన్ భగీరథ, కాళేశ్వరం అద్భుత పథకాలని కొనియాడినట్లు వివరించారు. ప్రత్యేక భౌగోళిక స్వరూపం కలిగిన రాష్టంలో నీటిని 83 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణకు వచ్చే ఐదేళ్లకు రూ.42 వేల కోట్లు ఖర్చవుతుందని వివరించామన్నారు. నిర్వహణ ఖర్చును కేంద్రమే భరించేలా సూచించాలని కోరినట్లు తెలిపారు.

ఇంటింటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో కేంద్రం ప్రభుత్వం కంటే ముందే మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చామని.. 'హర్​ ఘర్ ​జల్' పథకం కింద భగీరథ నిర్వహణకు రూ.12 వేల కోట్లు గ్రాంట్ రూపంలో ఇచ్చేలా చూడాలని కోరినట్లు తెలిపారు.

ప్రాంతీయ సదస్సులు భాగ్యనగరంలో నిర్వహించే యోజన

ఏడాది పాటు కాలపరిమితి పెరగడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల అధ్యయనానికి ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం భావిస్తోంది. దక్షిణ ప్రాంతాల కోసం హైదరాబాద్​లో సదస్సు నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఆర్థిక సంఘం ఛైర్మన్.. హరీశ్​రావుకు తెలిపారు. హైదరాబాద్​లో నిర్వహించే సదస్సుకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శస్తామని చెప్పినట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి:'మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఆలోచనను ఈసీ అమలు చేసింది'

Last Updated : Jan 29, 2020, 7:33 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details