తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదాయం ఇచ్చే ఆబ్కారీశాఖలో అంతా ఇంఛార్జీల పాలనే! - తెలంగాణ ఆబ్కారీ శాఖ

రాష్ట్ర ఆబ్కారీ శాఖలో పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి పోస్టులు ఖాళీ ఉండడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సహాయ కమిషనర్ల స్థాయి నుంచి జాయింట్‌ కమిషనర్ల వరకు ఒక్కొక్క అధికారి రెండు నుంచి ఆరు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. 15 మంది డీసీలకుగానూ ముగ్గురే ఉండడంతో ఇంఛార్జీలతోనే పాలన కొనసాగుతోంది.

telangana excise
telangana excise

By

Published : Sep 4, 2020, 12:16 PM IST

రాష్ట్రానికి ఆదాయం తెచ్చి పెట్టే శాఖల్లో ఆబ్కారీ శాఖ కూడా ఒకటి. మద్యం అమ్మకాల ద్వారా ఏటా ఎక్సైజ్‌ సుంకాల పేరుతో 20వేల కోట్ల నుంచి 25వేల కోట్ల మేర రాబడి రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. అలాంటి శాఖలో ఉన్నత స్థాయిలో పెద్ద సంఖ్యలో పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క అధికారి రెండు నుంచి ఆరు పోస్టులు వరకు విధులు నిర్వహించాల్సి వస్తోంది. కొన్ని ఏళ్లుగా అధికారులు ఒక్కొక్కరు పదవీవిరమణ అవుతుండడం, ఆ స్థానాలు పదోన్నతుల ద్వారా భర్తీకాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొంటున్నారు.

ఒక్కొక్కరికి ఆరు అదనపు బాధ్యతలు

రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు, మరో 800లకుపైగా బార్లు, క్లబ్‌లు ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం, నియంత్రించేందుకు, డిస్ట్రిలరీల పర్యవేక్షణ తదితర వాటి కోసం 4,300 మందికిపైగా ఈ శాఖలో పని చేస్తున్నారు. కానిస్టేబుళ్ల నుంచి సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల వరకు ఏవో కొన్ని మినహాయిస్తే దాదాపు అన్ని పోస్టులు భర్తీ అయ్యి ఉన్నాయి. ఎక్సైజ్‌ జిల్లాల సూపరింటెండెంట్ల దగ్గర నుంచి అదనపు కమిషనర్ల వరకు ఉన్న పోస్టుల్లోనే ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఇంఛార్జీలతో ఆ పోస్టులను భర్తీ చేయడంతో ఒక్కొక్కరు రెండు నుంచి ఆరు పోస్టుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

మూడు ఉమ్మడి జిల్లాలకు మాత్రమే డీసీలు

ఉమ్మడి పది జిల్లాలకు పది మంది డీసీలు, పది మంది ఏసీలు, పాలనాపరమైన అవసరాలకు మరో అయిదుగురు డీసీలు, మరో ఏడెనిమిది మంది ఏసీలు ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురు డీసీలు, ముగ్గురు ఏసీలు ఉన్నారు. అది కూడా రాష్ట్రంలోని పది జిల్లాల్లో రంగారెడ్డి, వరంగల్‌, మెదక్‌లకు మాత్రమే డీసీలు ఉన్నారు. ఇంఛార్జీల వివరాలను పరిశీలిస్తే రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ స్థానంలో అజయ్‌రావు ఉన్నారు. ఎక్సైజ్‌ అకాడమీ డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంటు జాయింట్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌, సహాయ కమిషనర్‌ కూడా ఆయనే. అంటే మొత్తం ఆరు పోస్టులకు ఏకైక అధికారి ఇంఛార్జీగా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఖురేషి. ఈయన డిస్ట్రిలరీ జాయింట్‌ కమిషనర్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ పోస్టుల్లో ఇంఛార్జీగా ఉంటున్నారు.

వరంగల్‌ డీసీకి మాత్రమే సింగల్ పోస్టు

మెదక్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ శాస్త్రి. ఈయన మెదక్‌ సహాయ కమిషనర్‌, కరీంనగర్‌ ఏసీ, డీసీల పోస్టులకు కూడా ఈయనే ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్‌ అంజన్‌రావు. ఈయన ఖమ్మం జిల్లా డీసీ, ఏసీ, నల్గొండ జిల్లా డీసీ ఇంఛార్జీగా... అంటే నాలుగు పోస్టుల్లో పని చేస్తున్నారు. నిజామాబాద్‌ ఏసీ... ఈయన నిజామాబాద్‌ డీసీ, ఆదిలాబాద్‌ ఏసీ, డీసీలుగా ఇంఛార్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంటు ఏసీ హరికిషన్‌. ఈయన ఏసీ హెడ్‌ క్వార్టర్స్‌, ఏసీ కంప్యూటర్స్‌ మొత్తం మూడు పోస్టుల్లో పని చేస్తున్నారు. ఒక్క వరంగల్‌ డీసీ సురేశ్‌ మాత్రం సింగిల్‌ పోస్టులో ఉన్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

పదోన్నతులపై దృష్టి సారించాలి
కీలకమైన పోస్టుల్లో అధికారుల కొరత ఉండడంతో... పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో మద్యం దుకాణాల్లో అమ్మకాల పర్యవేక్షణ, గుడుంబా తయారీ నియంత్రణకు, ఇతర నేరాల నియంత్రణపై దృష్టి పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. డిస్ట్రిలరీల్లో మద్యం తయారీకి వాడే ముడిపదార్థాలు కచ్చితమైన శాతాలు వాడేట్లు చూడడం లాంటి వాటిపై ఉన్నత స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల విషయంలోనూ ప్రత్యేక దృష్టిసారించి... పూర్తి చేసినట్లయితే అధికారుల కొరత దాదాపుగా తీరుతుందని పాలనాపరమైన ఇబ్బందులు కూడా లేకుండా పోయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు..!

ABOUT THE AUTHOR

...view details