తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలి' - తెలంగాణ తాజా వార్తలు

telangana enc letter to krmb
telangana enc letter to krmb

By

Published : Aug 23, 2021, 6:39 PM IST

Updated : Aug 23, 2021, 7:44 PM IST

18:36 August 23

'వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని కేఆర్‌ఎంబీ లేఖ'

 అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్టుతో పాటు అనదపు పనులను సహా ఇతర పనులను నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు. వరదనీటిపై ఆధారపడి నిర్మిస్తున్న వెలిగొండ లాంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటాయని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా ఏపీ కృష్ణా జలాలను బేసిన్ వెలుపలకు తరలిస్తోందని ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం చెప్పామని... ట్రైబ్యునల్ తీర్పుకు కూడా ఇది విరుద్ధమని లేఖలో తెలిపారు. అనుమతుల్లేని వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్  కొనసాగించకుండా వెంటనే నిలువరించాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి, జలవనరులవిభాగం సంచాలకుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.  

తాగునీటికి వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలి

 అటు తాగునీటి కోసం వినియోగించే నీటిని బచావత్  ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతం మాత్రమే లెక్కించాలని కోరుతూ ఈఎన్సీ మరో లేఖ రాశారు. ఈ విషయమై బోర్డును పదేపదే విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన... కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్ తీర్పులో ఈ అంశం స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో బోర్డు నిర్ణయం తీసుకోపోవడం వల్ల తెలంగాణ ఏడాదికి 31.9 టీఎంసీల వాటాను కోల్పోతోందని లేఖలో ఈఎన్సీ తెలిపారు. అన్ని అంశాలను ఇప్పటికే బోర్డు దృష్టికి తీసుకొచ్చామని... వెంటనే ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలని కోరారు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సంబంధిత వివరాలను కూడా లేఖతో పాటు జతపరిచారు.    

ఈనెల 27న కేఆర్​ఎంబీ సమావేశం

 రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల పంపకం సహా కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే... రెండు రాష్ట్రాలకు నోటీసు ఇచ్చారు. 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ 14వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశ ప్రతిపాదిత ఎజెండాను నోటీసుతో పాటు జతపర్చారు.

నీటి వాటాలపై చర్చ

ఇప్పటి వరకు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో వినియోగించుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి చెరిసగం నీటిని వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. దీంతో 2021-22 సంవత్సరంలో కృష్ణ జలాల వినియోగంపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తమ వాటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ దీన్ని వ్యతిరేకిస్తోంది. బోర్డు సూచనలతో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. తెలంగాణ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ అంశంపై సమావేశంలో మరోమారు చర్చ జరగనుంది.  

ఫిర్యాదులపై చర్చ

ఇటీవల ప్రాజెక్టులు నిండినపుడు రెండు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేశాయి. అందుకు ఉపయోగించిన నీటిని లెక్కల్లోకి తీసుకురావాలా వద్దా అన్న విషయమై చర్చించనున్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బోర్డు పరిధి, నిర్వహణ, అమలు కార్యాచరణ, సంబంధిత అంశాలపై బోర్డులో చర్చిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్నెళ్లలో అనుమతులు తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు. జూన్ నెలలో శ్రీశైలం సహా ఇతర చోట్ల తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ తెలంగాణను కోరింది. ఆ అంశాలపై కూడా భేటీలో చర్చించనున్నారు. చిన్ననీటి వనరులకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ మొత్తాన్ని తెలంగాణ వినియోగించుకుంటోందని ఆంధ్రప్రదేశ్ గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. 

ఇదీ చూడండి:KRMB: ఈ నెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ.. అజెండాలో కీలకాంశాలు

Last Updated : Aug 23, 2021, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details