Telangana Election Campaign Vehicles : తెలంగాణలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఓ వైపు అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు ఖరారైన నాయకులు.. తమ అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. మరోవైపు ప్రచారానికి కావాల్సిన సామగ్రి, వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రచార రథాలను (Telangana Election Campaign Vehicles) ఆధునిక హంగులతో తయారు చేయించుకుంటున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు.
గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట
ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసేందుకు, ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా.. ప్రచార రథాలను తమ అభిరుచికి తగినట్లు తయారు చేయించుకుంటున్నారు. పార్టీ గుర్తులు, ముఖ్య నేతల చిత్రాలతో పాటు అభ్యర్థి కూడా కనిపించే విధంగా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రచార రథాల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారింది. తద్వారా కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
దోమలగూడలోని చిన్న ఆర్ట్ సంస్థ ఈ ప్రచార రథాలకు పేరుగాంచింది. నాడు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార వాహనాన్ని.. సంస్థ యజమాని చందర్‌రావు అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో వందలాది ప్రచార రథాలను.. పార్టీల అభీష్టానికి అనుగుణంగా తయారు చేస్తున్నారు. తద్వారా నేతల మన్ననలను పొందుతున్నారు.
"పార్టీల ప్రచార రథాలను తయారుచేస్తున్నాం. ప్రజల్లోకి వెళ్లే విధంగా వీటిని రూపొందిస్తున్నాం. ఎన్నికల ప్రచార రథాలే కాకుండా.. ఇతర భకి కార్యక్రమాలకు సంబంధించి తయారుచేస్తాం." - చందర్‌రావు, చిన్న ఆర్ట్ సంస్థ యజమాని