Telangana Leaders Campaign Through Social Media :రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యం(Telangana Election Poll 2023)లో నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పాత పద్ధతులలో ప్రచార సభలకు డబ్బులిస్తే వేల సంఖ్యలో జనం హాజరవ్వడం మామూలే.. కానీ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఆధునిక ప్రచారానికి నేతలు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సామాజిక మాధ్యమాల(Social Media Campaign) వైపు తొంగి చూస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఆన్లైన్ వైపు చూడని నేతలు ఒక్క పోస్టుతో వేలు, లక్షల మందిని చేరుకోవాలంటే.. వ్యక్తిగత ఖాతా తెరిచి పాలోవర్లు పెరిగే వరకు నిరీక్షించాలి. ఇది చాలా కష్టం. ఇలాంటివి ఏవీ లేకుండా పైసా కొడితే చాలు వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను తెచ్చి పెట్టే కొత్త విధానం అందుబాటులో ఉంది. ఇందులో ఒక్కో ఫాలోవర్‌కు రూ.3 నుంచి రూ.5 వరకు ధరను నిర్ణయించి.. లక్షల సంఖ్యలో ఉన్న ఫాలోవర్లు ఉండే సామాజిక మాధ్యమ పేజీలను కొందరు అమ్మేసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీటికి భలే గిరాకీ ఉందని సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు చెబుతున్నారు.
ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం :ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు పైచేయి సాధించాలని భావిస్తూ.. ఇంటింటికీ వెళ్లి ప్రజా సంబంధాలను పెంచుకోవాలనుకుంటారు. మరి కొందరు హోర్డింగులు, ఫ్లెక్సీలు, వార్తాపత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తారు. ఇది అంతా ఒకెత్తు అయితే.. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత స్థాయిలో అందరికీ చేరువై తటస్థ ఓటర్లను ఆకర్షించడం మరో ఎత్తు. ఇలాంటి ప్రచారానికి రాష్ట్రస్థాయి నేతలే కాదు.. నియోజకవర్గ స్థాయి నాయకులు గురి పెట్టారు. ఎక్కువ ప్రజాదరణ ఉండి.. లక్షల ఫాలోవర్లు ఉండే పేజీలను డబ్బులిచ్చి కొనుగోలు చేసి.. తాత్కాలికంగా సోషల్ స్ట్రాటజిస్టులను నియమించుకుంటారు.
డబ్బులు లిస్తే కంటెంట్ రెడీ :మరోవైపు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అందులో ఉండే కంటెంట్ నచ్చితేనే ఎక్కువ మందిని వాటిని అనుసరిస్తారు. లేకపోతే అసలు వాటి జోలికే వెళ్లరు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో యువతే యాక్టివ్‌గా ఉంటున్నారు. చాలా మంది అడ్మిన్లు వర్తమాన రాజకీయాలకు సంబంధించిన పోస్టులు, కార్టూన్లు, మీమ్‌లు, నేతల ప్రసంగాల వీడియోలు నిత్యం పోస్టు చేస్తుంటారు. నెల వ్యవధిలో మంచిగా లక్షల మంది ఫాలోవర్లను సంపాదిస్తారు. ఇప్పుడు నేతలు వారిని సంప్రదించి.. ఫాలోవర్‌కు రూ.3 నుంచి రూ.5 చొప్పున ధర నిర్ణయిస్తారు. ఆ తర్వాత అడ్మిన్లను తొలగిస్తారు. ఇంకా ఎవరైనా ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తే ఖాతాను వారి పేర్ల మీదకు మారుస్తారు.