Telangana Election Campaign 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓ వైపు ఇంటింటి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ.. మరో వైపు వినూత్న ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేట్ డివిజన్‌లో పలు బస్తీలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ.. తమకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రచారం చేయడానికి వచ్చిన తలసానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.
Political Parties Campaign in Telangana : మరోవైపు జూబ్లీహిల్స్‌లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP president Purandeswari) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే -2ఏ బొగ్గు గనిలో.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్మికులతో కలిసి మాట్లాడిన చందర్.. తనకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం
Telangana Assembly Elections 2023 : మరోవైపు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో మంత్రి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay Kumar) రోడ్ షో నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటేసి మూడోసారి గులాబీ పార్టీని గెలిపించాలని పువ్వాడ ఓటర్లను అభ్యర్థించారు.