Telangana Election Campaign 2023 :అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారాతో రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. ప్రజాక్షేత్రంలో దిగుతున్న నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంక శేషయ్య బంజర్‌లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. మరోసారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. సత్తుపల్లిలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని సండ్ర కోరారు.
BRS Election Campaign 2023: కాంగ్రెస్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచటం ఖాయమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూనే కాంగ్రెస్ వస్తే జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు.బీజేపీ మతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి చేయరని ఆరోపించారు. బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలను మానుకోవాలని వినోద్ కుమార్ హితవు పలికారు.
Congress Election Campaign 2023 :కాంగ్రెస్‌ని ఆశీర్వదిస్తేఆరు గ్యారెంటీలతో పేదలకు అండగా నిలబడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాల 33 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడకు వెళ్లిన జీవన్ రెడ్డి ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కరపత్రాలు పంపిణీచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన భూమాఫియా, ఇసుక మాఫియాకు తోడు కమీషన్ల ప్రజాసొమ్ము దోచుకున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..సబ్బండ వర్గాలకు మేలు చేసేలా తమ మేనిఫెస్టో ఉంటుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.