Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచారసరళిని చూస్తే.. ఎన్నికల్లో అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్ఎస్.. ప్రచారంలోనూ ఇతరులకంటే కాసింత ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), కేటీఆర్, హరీశ్‌రావు మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. ఆ ప్రగతి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలనే విషయాన్ని అర్ధమయ్యేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
BRS Election Campaign 2023 : బీఆర్ఎస్ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రైతులు, కూలీలు, మహిళా, యువజన, కుల సంఘాలతో సమావేశమై.. చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. నగరాల్లో, పట్టణాల్లో.. వివిధ యూనియన్ల, బస్తీల్లో స్థానికులు, కాలనీల బాధ్యులతో సమావేశం అవుతున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సమావేశమవుతూ ఇళ్లకు నిరంతర విద్యుత్తు, ఉచిత తాగునీరు, తగ్గించిన ఇంటి పన్నులు, స్థలాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. తదితరాలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. మరోసారి దీవించాలని కోరుతున్నారు.
BRS Election Campaign in Social Media: సామాజిక మాధ్యమ ప్రచారానికి బీఆర్ఎస్(BRS) పెద్దపీట వేస్తోంది. నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమ బృందాలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి బూత్ పరిధిలో ఉన్న ఓటర్లందరితో కలిపి వాట్సాప్ గ్రూప్‌లను ప్రారంభిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు? ఏ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది? మహిళల కోసం ప్రభుత్వం ఏం చేసింది? మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో.. వీటి వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలిసే విధంగా పోస్ట్‌లు చేస్తున్నారు.
Telangana Congress Election Campaign 2023 : ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్(Congress) ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రేసు గుర్రాల జాబితా వెల్లడి కాసింత ఆలస్యం అయినా.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై భారీగా ఆశలు పెట్టుకుంది. పార్టీ ప్రచారంలో ఎక్కువగా నాయకులందరూ ఈ ఆరు గ్యారెంటీలపైనే మాట్లాడుతున్నారు. పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తమ అగ్రనేత సోనియాగాంధీతో ఆరు గ్యారెంటీల కార్డులను కాంగ్రెస్ నేతలు విడుదల చేయించారు. మరుసటిరోజు నుంచేనియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.