తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2020, 7:26 AM IST

ETV Bharat / state

డిసెంబరు నుంచి విద్యాలయాలు తెరుచుకోనున్నాయ్​ !

తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తెరవాలని విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 1 నుంచి తెరిచి విద్యార్థులకు తరగతిగది బోధన ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది. తొలుత 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకే అనుమతినిచ్చింది.

Details of the start of schools in Telangana
డిసెంబరు నుంచి విద్యాలయాలు తెరుచుకోనున్నాయ్​ !

పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను డిసెంబరు 1 నుంచి తెరిచి విద్యార్థులకు తరగతిగది బోధన అందించాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి.. అందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి.. అనే అంశాలపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం విద్యాశాఖలోని వివిధ విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటుచేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు శ్రీహరి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలను తెరిచాయని, మరికొన్ని దీపావళి తర్వాత తెరిచేందుకు తేదీలను ప్రకటించాయని, ఆయా రాష్ట్రాల్లో అనుభవాలను పరిశీలించి డిసెంబరు 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.

పాఠశాల విద్యాశాఖలో మొదట 9, 10 తరగతులు.. వాటితో పాటు ఇంటర్‌ క్లాసులు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. డిసెంబరు ఒకటి నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు మొదలుపెట్టాలని ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) కాలపట్టికను విడుదల చేసిందని, ఈ క్రమంలో డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు విశ్వవిద్యాలయాలను కూడా వచ్చే నెల నుంచి తెరిస్తే మంచిదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి సూచించినట్లు తెలిసింది. ‘విద్యాసంస్థలను హడావిడిగా తెరిచే ఉద్దేశం లేదు.. విద్య ఎంత ముఖ్యమో.. పిల్లల ఆరోగ్యమూ అంతే ముఖ్యం’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కళాశాల/సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారి నవీన్‌ మిత్తల్‌తో మరోసారి చర్చించాలని నిర్ణయించారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపి ఆమోదం తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details