తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతీయ వృద్ధి రేటును అధిగమిస్తున్న తెలంగాణ' - state budget 2020

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు... తాత్కాలిక వృద్ధి రేటు విషయంలో జాతీయ రేటును ఏటా అధిగమిస్తు వస్తున్నట్లు... సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది. వాస్తవ వృద్ధి రేటు విషయంలో 2015- 16 నుంచి జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదవుతున్నట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా, జాతీయంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించినప్పటికీ... తెలంగాణ మాత్రం వృద్ధి రేటులో మంచి స్థాయిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ఆర్థిక వృద్ధి నెమ్మదించేందుకు జాతీయ, అంతర్జాతీయ అంశాలే కారణమని అభిప్రాయపడింది.

Telangana economic survey
వృద్ధి రేటును అధిగమిస్తున్న తెలంగాణ

By

Published : Mar 8, 2020, 7:45 PM IST

సామాజిక ఆర్థిక సర్వేను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నివేదిక ప్రకారం... వాస్తవ వృద్ధి రేటు విషయంలో తెలంగాణ 2015- 16 నుంచి జాతీయ సగటును అధిగమిస్తూనే ఉంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు... తాత్కాలిక వృద్ధి రేటు విషయంలో జాతీయ రేటు ఏటా అధిగమిస్తూ వస్తోంది. 2019- 20లో తెలంగాణ 8.2 శాతం వృద్ధి రేటు సాధించనున్నట్లు నివేదిక తెలిపింది. అదే సమయంలో దేశ జీడీపీ కేవలం 5 శాతమే పెరగగా.. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు కేవలం 2.4 శాతమే ఉంది.

వేగంగా పట్టణీకరణ..

2018-19లో 6.13 లక్షల కోట్లున్న వాస్తవ జీడీపీ... ఈ ఏడాది 6.63 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ధరల్లో 2018- 19లో రూ.8లక్షల 61వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీడీపీ... 2019- 20లో రూ.9లక్షల70కోట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం తాత్కాలిక వృద్ధి రేటు 12.6 శాతం నమోదైంది. పట్టణీకరణ వేగంగా ఉండటం తెలంగాణ వృద్ధికి దోహదపడింది.

జాతీయ స్థాయి అధిగమించేలా..

వివిధ రంగాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే... 2019- 20 ముందస్తు అంచనాల ప్రకారం... ప్రస్తుత ధరల్లో అన్ని రంగాల్లో జాతీయ స్థాయిని తెలంగాణ అధిగమించనున్నట్లు నివేదిక తెలిపింది. స్థిర ధరల్లో ప్రాథమిక, తృతీయ రంగాల్లో వృద్ధి రేటు విషయంలో కూడా అదే తీరు కొనసాగనుండగా... తృతీయ రంగంలో జాతీయ స్థాయిని దాటలేకపోతుందని నివేదిక తెలిపింది. ప్రస్తుత ధరల్లో... ప్రాథమిక రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 15.8 ఉండగా... దేశ వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ద్వితీయ రంగంలో జాతీయ రేటు 2.5 శాతం ఉండగా.. రాష్ట్ర రేటు 5.3 శాతంగా ఉంది. తృతీయ రంగంలో దేశ వృద్ధి రేటు 9.8 శాతం కాగా... రాష్ట్ర స్థాయిలో 14.1 శాతం ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి... ప్రాథమిక రంగంలో 2016- 17లో అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. ద్వితీయ రంగంలో 2015- 16, తృతీయ రంగంలో 2014- 15లలో గరిష్ఠ వృద్ధి రేటు నమోదైంది.

స్వల్పంగా పడిపోయిన వృద్ధిరేటు..

ప్రస్తుత ధరల్లో 2018- 19లో 14.3 శాతంగా ఉన్న రాష్ట్ర వృద్ధి రేటు.. 2019- 20లో 12.6 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగంలో... గతేడాది 13.2 శాతం వృద్ధి రేటు ఉండగా... ప్రస్తుతం అది 15.8 శాతానికి ఎగబాకింది. ద్వితీయ రంగంలో గతేడాది 10.1 శాతం వృద్ధి రేటు ఉండగా... ఈ ఏడాది 5.3 శాతానికి పడిపోయింది. తృతీయ రంగంలో అప్పుడు నమోదైన 14.9 శాతం వృద్ధిరేటు... ఈ ఏడాది 14.1 శాతానికి స్వల్పంగా పడిపోయింది. 2011- 12 నుంచి 2019- 20 వరకు ధోరణిని పరిశీలించినట్లయితే... రాష్ట్ర జీడీపీలో ప్రాథమిక, ద్వితీయ రంగాల వాటా పడిపోతూ వస్తోంది. తృతీయ రంగం వాటా పెరిగింది. తెలంగాణ జీడీపీలో అత్యధిక వాటా సేవరంగానిదే. ప్రస్తుతం... ఈ రంగం 65.2 శాతం స్థూల జాతీయోత్పత్తిని అందిస్తోంది. ప్రాథమిక, ద్వితీయ రంగాల వాటా వరుసగా 18.6 శాతం, 16.2 శాతం ఉన్నాయి.

నిర్మాణ రంగం వాటా 4శాతం

పారిశ్రామిక రంగంలో తయారీ రంగం వాటా 10.6 శాతం ఉండగా.. నిర్మాణ రంగం వాటా 4 శాతం ఉంది. ఇది ఉద్యోగ అవకాశాల కల్పించేందుకు శుభసూచకమని నివేదిక తెలిపింది. సేవా రంగంలో స్థిరాస్తి రంగం వాటా 22.2 శాతం కాగా.. వ్యాపారం, మరమతుల సేవలు, హోటళ్లు, రెస్టారెంట్ల రంగం 16.3 శాతం వాటా ఉంది. కొన్ని రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ మాదిరిగా స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేసినట్లు నివేదిక పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి దేశ జీడీపీలో రాష్ట్ర వాటా స్థిరంగా పెరుగుతోంది. 2013- 14లో 4.02 శాతం వాటా ఉండగా... 2019- 20లో తాత్కాలిక జీడీపీ 4.76 శాతానికి పెరిగింది.

ఇదీ చూడండి:తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ABOUT THE AUTHOR

...view details