రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ (TS EAMCET counseling) ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 24వ తేదీన.. ఇంజినీరింగ్ ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నారు. ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ (TS EAMCET counseling) లో 59,993 సీట్లను కేటాయించగా.... 53,717 మంది కాలేజీల్లో చేరారు. మరో 6,279 మంది తమ సీటును రద్దు చేసుకున్నారు. ప్రత్యేక విడత కోసం.. 26,073 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్సైట్ ద్వారా బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు.. కాలేజీకి వచ్చి చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక రౌండులో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 26 వరకు అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 25న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ (TS EAMCET counseling) కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 వేల రూపాయలు.. మిగతా అభ్యర్థులు 10వేల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. కాలేజీలో చేరిన తర్వాత ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తారు.