ఈనెల 9 నుంచి 14 వరకు జరగనున్న ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సర్వం సన్నద్ధమైంది. కరోనా కష్టకాలమున్నా.. ఒక్క నిమిషం నిబంధనలో ఎలాంటి మార్పు లేదని కన్వీనర్ గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆలస్యంగా వస్తే అనుమతించేది లేదని వెల్లడించారు.
ఎంసెట్ పరీక్షకు రంగం సిద్ధం.. నిబంధనలు కఠినతరం - Telangana EAmcet Engineering Exam
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9 నుంచి 14 వరకు.. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. తెలంగాణ, ఏపీలలో 102 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.
తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్లో మధ్యాహ్నం3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి లక్షా 43వేల 165 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ నమోదు చేయకూడదని నిర్ణయించారు. అభ్యర్థి నిర్ధరణ కోసం వెబ్‌క్యామ్ ద్వారా ఫొటో తీసి పోల్చి చూస్తారని కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. భౌతిక దూరం పాటించేందుకు పరీక్షా కేంద్రం వద్ద క్యూలైన్లు, సర్కిళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థులను లోనికి పంపిస్తామని తెలిపారు. శానిటైజర్, నీళ్ల సీసాను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా.. పరీక్ష రాయాలని కన్వీనర్ గోవర్ధన్ సూచించారు.