కరోనా కారణంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు వేర్వేరుగాఎంసెట్ నిర్వహించారు. ఇందులో 78,981 మంది అగ్రికల్చర్, మెడిసిన్ విభాగానికి దరఖాస్తు చేసుకోగా.. వారిలో 63,857 మంది పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇందులో 92.57శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించింది. తొలి మూడు ర్యాంకులు అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. అయితే...మొదటి పది ర్యాంకుల్లో ఐదు తెలంగాణ, మరో ఐదింటిని ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ వివరాలు తప్పుగా ఇవ్వడం వల్ల.. 667 మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయించలేదని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ ఎత్తివేత!
ఎంసెట్‌లో కీలక మార్పుల దిశగా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ తొలగించాలని భావిస్తోంది. నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. సర్కారు అంగీకరిస్తే వచ్చే ఏడాది నుంచి కేవలం ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు కేటాయిస్తామని వివరించారు. గతంలో ఐఐటీ,ఎన్ఐటీలో వెయిటేజీ విధానం అవలంభినప్పటికీ...... తర్వాత తొలగించారు. అందువల్ల రాష్ట్రంలోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించే ఆలోచన ఉందని పాపిరెడ్డి తెలిపారు.