తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వేలో తెలంగాణకు నిరాశ.. మొక్కుబడిగా కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు చేసిన కేటాయింపులు నూతన రాష్ట్రం, రైల్వే నెట్‌వర్క్‌ తక్కువగా ఉన్న తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. కొత్త రైళ్ల మంజూరు ఊసెత్తకుండా పక్కనపెట్టిన కేంద్రం.. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టునూ మంజూరు చేయలేదు. చిరకాల వాంఛ కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ విషయంలో మరోసారి మొండిచెయ్యి చూపింది. నాలుగేళ్ల క్రితం కాజీపేటకు మంజూరుచేసిన పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌) ప్రాజెక్టుకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే విదిల్చింది. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకు కొత్తగా నిధులివ్వలేదు. పనుల పురోగతికి అంటూ సాంకేతికంగా రూ.10 లక్షలు చూపారు.

railway budget 2021
railway budget 2021

By

Published : Feb 4, 2021, 5:28 AM IST

కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భారతీయ రైల్వేకు రూ.1.10 లక్షల కోట్ల మొత్తాన్ని కేటాయింపుగా చూపారు. జోన్ల వారీగా కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ను రైల్వేశాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. గతేడాది కంటే ఈసారి కేటాయింపులు పెరిగాయని రైల్వేశాఖ చెబుతున్నప్పటికీ అది కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైంది. పనులు చివరిదశలో ఉన్నవాటికే కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చింది.

ఈ ప్రాజెక్టులకు నిధులు రూ.వెయ్యే

ఏపీలోని మాచర్ల-తెలంగాణలోని నల్గొండ కొత్తలైన్‌ దశాబ్దాల క్రితం మంజూరైంది. నిధుల్లో ప్రతి ఏటా పక్కనపెడుతున్న కేంద్రం ఈసారి రూ.వెయ్యి మాత్రమే కేటాయించింది. భద్రాచలం-కొవ్వూరుకు, పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌కు, మణుగూరు-రామగుండం, విష్ణుపురం-జాన్‌పహాడ్‌ వంటి లైన్లకూ రూ.వెయ్యి చొప్పునే కేటాయించింది. రూ.2,800 కోట్ల అంచనా వ్యయంతో నాలుగేళ్ల క్రితం మంజూరుచేసిన ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ వయా నిర్మల్‌ ప్రాజెక్టు ఊసే కన్పించలేదు.

2420 కోట్లు కేటాయించాం

నిర్మాణంలో ఉన్న 15 కొత్త/డబ్లింగ్‌ ప్రాజెక్టులకు 2021-22కి రూ 2,420 కోట్లు కేటాయించామని, వీటి అంచనా వ్యయం రూ.29,581 కోట్లని కేంద్రం తెలిపింది. వీటి దూరం 2,493 కిలోమీటర్లని పేర్కొంది. 2009-14 మధ్య అప్పటి ప్రభుత్వం తెలంగాణలో నూతన ప్రాజెక్టుల కోసం ఏమీ ఇవ్వలేదని తెలిపింది.

జూన్‌ కల్లా మహబూబ్‌నగర్‌ వరకు రెెండో లైను

సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ (2వలైను) పనులు పురోగతిలో ఉన్నాయి. 85 కిమీ దూరం గల ఈ లైను జూన్‌ కల్లా పూర్తవుతుందని రైల్వేశాఖ తెలిపింది. 54 కి.మీ. నిడివి కలిగిన భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి మార్గాన్ని కూడా ఈ ఏడాది జూన్‌ వరకు పూర్తిచేయనున్నట్లు పేర్కొంది.

ద.మ.రైల్వే కేటాయింపుల్లో..

జోన్‌ మొత్తానికి రూ.6,789.71 కోట్లు కేటాయించినట్లు చూపించినా.. ఇందులో మూలధన వ్యయం రూ.4,788.43 కోట్లు మాత్రమే. ఇందులోనూ ప్రజలకు ఉపయోగపడే కొత్తలైన్ల నిర్మాణం, డబ్లింగ్‌ వంటివాటికి కేటాయింపులు తక్కువే. కొత్తలైన్ల నిర్మాణానికి నిధులు చాలా తక్కువ కేటాయించారు. మూలధన వ్యయం, ఇతరత్రా కలిపి కేటాయింపులు ఇలా..

  • కొత్త లైన్ల నిర్మాణానికి రూ.205 కోట్లు
  • డబ్లింగ్‌కు రూ.868 కోట్లు
  • ట్రాక్‌ రెన్యూవల్‌కు రూ.862 కోట్లు
  • సిగ్నలింగ్‌ టెలికమ్యూనికేషన్స్‌ రూ.191.22 కోట్లు
  • ప్రయాణికుల సదుపాయాలకు రూ.199.49 కోట్లు
  • ట్రాఫిక్‌ సదుపాయాలు యార్డు రీమోడలింగ్‌కు రూ.72.65 కోట్లు
  • రహదారి భద్రత ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.562.86 కోట్లు
  • రహదారి భద్రత లెవల్‌ క్రాసింగ్‌ పనులకు రూ.49.52 కోట్లు

రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు కేటాయింపులు

  • మనోహరాబాద్‌-కొత్తపల్లి : రూ.325 కోట్లు
  • కాజీపేట విజయవాడ 3వ లైను: రూ.333 కోట్లు
  • కాజీపేట బల్లార్ష 3వ లైను: రూ.420 కోట్లు
  • చర్లపల్లి నూతన టెర్మినల్‌ : రూ.50 కోట్లు.
  • మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌ డబ్లింగ్‌: రూ.149కోట్లు
  • అక్కన్నపేట-మెదక్‌: రూ.83 కోట్లు
  • భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి: రూ.267 కోట్లు

ABOUT THE AUTHOR

...view details