DGP Anjani Kumar Review Meeting: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి, భద్రతల పరిరక్షణకై మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యలయంలో పోలీస్ కమీషనర్లు, జిల్లా ఎస్పీలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు.. పాదయాత్రలు, బహిరంగ సభలు అధికంగా నిర్వహించడం జరుగుతోంది. కనుక శాంతి భద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్‌ల పనితీరు అత్యంత కీలకమని అంజనీకుమార్ తెలిపారు. డా. బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో నవ సమాజ నిర్మాణానికి రాష్ట్రంలోని అందరు పోలీసు అధికారులు పునరంకితం కావాలని డీజీపీ అంజనీ కుమార్ కోరారు.
సరికొత్త వ్యూహంతో పనిచేయాలి :పోలీసు అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతీ బందోబస్తు ఒక పరీక్షగా ఉంటుందని.. ప్రతీసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు చెందిన సరిహద్దు జిల్లాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా తీవ్రవాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. సామాన్య ప్రజలు, పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో పోలీసు శాఖ సిబ్బంది, అధికారుల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని అంజనీకుమార్ స్పష్టం చేశారు.