Decade Celebrations in Telangana Today : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దశాబ్ది సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని కలెక్టరేట్లలో మంత్రులు, ప్రభుత్వ విప్ జాతీయ జెండా ఆవిష్కరించారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ గ్రౌండ్స్‌లో మంత్రి గంగుల, జగిత్యాల కలెక్టరేట్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సిరిసిల్లలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
"కేసీఆర్ సారధ్యంలో 9 సంవత్సరాల్లోనే అత్యంత ప్రగతిశీలి రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంది. ప్రజాసంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయ, దాని అనుబంధ సంస్థలకు ప్రభుత్వాలు అరకొర నిధులు ఇచ్చేవి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 20 రెట్ల నిధులు అధికంగా ఖర్చు చేసింది. కొందరు వ్యవసాయం దండగ అన్నా.. కేసీఆర్ ప్రభుత్వం పండగ చేసింది." - కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
TS Formation Day Celebrations in Nizamabad :నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి ప్రస్థాన్నాన్ని వివరించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు.