Telangana Decade celebrations 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమైంది. కొత్త సచివాలయం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రారంభ వేడుకలు సచివాలయంలో జరగనున్న తరుణంలో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ సచివాలయంలో ప్రారంభించనున్నారు. జూన్ 2న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత దశాబ్ది వేడుకల సందర్భంగా సీఎం సందేశమిస్తారు. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు.. దాదాపు 25 వేల మంది వరకు ప్రారంభ వేడుకలకు హాజరవుతారని అంచనా.
Telangana Formation Day celebrations 2023 : ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ శాంతికుమారి ఆహ్వానపత్రికలు పంపారు. వేడుకలకు అనుగుణంగా సచివాలయం ముందు ఉన్న పచ్చిక బయళ్లలో.. భారీ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ దీపాలతో సచివాలయ భవనం, పరిసరాలను తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. మిషన్ భగీరథ ఇంజనీర్లు, అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండుగ ఏర్పాట్లు ఘనంగా చేయాలన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులు, నాయకులు దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ములుగు జిల్లా అన్ని రంగాల్లో జరిగిన ప్రగతి చాటేలా పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని మంత్రి సత్యవతి సూచించారు. ఈ మేరకు ములుగులో.. అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాఠోడ్ శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి.. కేవలం దశాబ్ది కాలంలోనే జరిగిందని కితాబిచ్చారు.