Telangana Decade Celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడటం సహా సమన్వయంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణపై అన్నిశాఖల కార్యదర్శులు.. ఆ తర్వాత కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఆరాతీశారు. డాక్యుమెంటరీలు, సంబంధిత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చూడాలని.. నిర్ణీత గడువులోగా అన్ని సిద్ధం చేయాలని.. సీఎస్ స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో చేస్తున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 21 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సూక్ష్మస్థాయిలో సమీక్షించారు. ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. కలెక్టర్లకు శాంతికుమారి స్పష్టం చేశారు.
Telangana Decade Celebrations 2023 : దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని.. ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా భాగస్వాములై పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. 9 ఏళ్లలో తెలంగాణ వివిధ అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలబడి జాతీయ స్థాయిలో సింహభాగాన్ని ఆక్రమించిందన్నారు.
రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ అధికారులకు సూచించారు. మహబూబాబాద్‌లోని కలెక్టరేట్‌లో జూన్ 2 నుంచి 22 వరకు జరిగే వేడుకలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.