వచ్చే ఆర్థిక సంవత్సరం 2020లో పంట రుణాలు ప్రధాన పంటలకు అదనంగా పెంచి ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సాంకేతిక కమిటీ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న ఏ పంటకూ రుణం పెంచలేదు. కానీ ఉద్యాన పంటలైన టమాటా, వెల్లుల్లి, ఆయిల్ పామ్, ,చామంతి, పుచ్చ, శెనగ తదితర పంటలకు రుణ పరిమితి స్వల్పంగా పెంచారు.
కొరవడిన సాగుపంటల ప్రోత్సాహకం
వ్యవసాయ బోరు లేదా ఇతర రూపంలో సాగునీటి వసతి ఉన్న భూమిలో టమాటా పంట సాగు చేస్తే ఎకరానికిచ్చే రుణాన్ని ఈ ఏడాదికన్నా అదనంగా మరో 10 వేలు పెంచి 45 వేలు నిర్ణయించడం విశేషం.
సవరించి, తగ్గించి పంపండి
తొలుత జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ ( డీఎల్‌టీసీ )లు క్షేత్రస్థాయిలో రైతులు పంటల సాగుకు పెడుతున్న ఖర్చులపై అధ్యయనం చేసి నివేదికలను ఎస్ఎల్ బీసీకి పంపాయి. పాత పాలమూరు డీఎల్‌టీసీ రైతులకు ఖర్చులు పెరుగుతున్నాయని పంట రుణ పరిమితి పెంచాలని సిఫార్సు చేసింది. కానీ ఈ సిఫార్సులు ఆమోద యోగ్యంగా లేవని, మళ్లీ జిల్లా స్థాయిలో సమీక్ష జరిపి వాటిని సవరించి లేదా తగ్గించి పంపాలని రాష్ట్ర కమిటీ ఆదేశించడం గమనార్హం.