ఈనెల మూడో వారం నుంచి రాష్ట్రంలో పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం కోసం సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం (cs review on Podu Lands)జరిగింది. ఈ భేటీకి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ శేషాద్రి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినా, తెలంగాణ టెక్నలాజికల్ సర్వీసెస్ ఎండీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
దరఖాస్తు ఏ విధంగా ఉండాలి.. అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కో ఆర్డినెట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్సర్వేటర్లు, డీఎఫ్ఓలతో సమావేశం (podu lands issue)నిర్వహించాలని నిర్ణయించారు.
ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఏం చెప్పారంటే..
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా అక్టోబర్ 9న రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష (CM KCR Review on Podu Lands) నిర్వహించారు. పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. పోడు సాగుదారుల లెక్క తేల్చి సమస్య పరిష్కరించాలన్నారు.