తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాలమూరు-రంగారెడ్డి' పనులు నిలిపివేశాం.. ఎన్జీటీలో తెలంగాణ కౌంటర్‌ అఫిడవిట్‌ - telangana news

Palamuru-Rangareddy Lift Irrigation: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేశామని, ఉత్తర్వుల అనంతరం ఏవీ చేపట్టలేదంటూ తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎన్జీటీ ఉత్తర్వుల ఉల్లంఘన అంశానికి సంబంధించి ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

‘పాలమూరు-రంగారెడ్డి’ పనులు నిలిపివేశాం.. ఎన్జీటీలో తెలంగాణ కౌంటర్‌ అఫిడవిట్‌
‘పాలమూరు-రంగారెడ్డి’ పనులు నిలిపివేశాం.. ఎన్జీటీలో తెలంగాణ కౌంటర్‌ అఫిడవిట్‌

By

Published : Feb 25, 2022, 7:01 AM IST

Palamuru-Rangareddy Lift Irrigation: జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేశామని, ఉత్తర్వుల అనంతరం ఏవీ చేపట్టలేదంటూ తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎన్జీటీ ఉత్తర్వుల ఉల్లంఘన అంశానికి సంబంధించి ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులో సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ పలు అంశాలను పేర్కొన్నారు. ‘రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో 18 ప్యాకేజీలుగా చేపట్టిన పథకమిది. గతేడాది అక్టోబరు 29న ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు గుత్తేదారులు పనులను నిలిపివేయడం ప్రారంభించారు. భారీ నిర్మాణాలు కావడం, పెద్ద యంత్రాలు ఉండటంతో నిర్దిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు నష్టం వాటిళ్లకుండా యంత్ర సామగ్రిని నిర్మాణాల నుంచి వెనక్కు తీయాల్సి ఉండటంతో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే యంత్రాల తరలింపునకు సమయం పట్టింది. ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘించినట్లు ప్రతివాదులు దాఖలు చేసిన వ్యాజ్యంలో వాస్తవం లేదు. ఉల్లంఘనలకు సంబంధించిన వ్యాజ్యాన్ని కొట్టి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

నివేదిక దాఖలుకు గడువు ఇవ్వండి

నివేదిక సమర్పణకు వారం రోజులు గడువు ఇవ్వాలని పాలమూరు ఎత్తిపోతల పనులపై విచారణ చేపట్టిన రెండు కమిటీలు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కోరాయి. ఎన్జీటీ ఉత్తర్వుల ఉల్లంఘనలపై అధ్యయనం చేసేందుకు వివిధ శాఖలు, విభాగాలు, నిపుణులతో సంయుక్త కమిటీని కేఆర్‌ఎంబీ ఏర్పాటు చేసింది. పనుల స్థాయి ఎక్కడి వరకు వచ్చిందో పరిశీలించడానికి ముగ్గురు నీటిపారుదల శాఖ ఇంజినీర్లతోనూ ఒక కమిటీని నియమించింది. ఈ రెండు కమిటీలు ఇప్పటికే మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ప్రాజెక్టు నిర్మాణాల ప్రాంతాల్లో పర్యటించాయి. రెండు రోజుల్లోనే నివేదికను సమర్పించాల్సి ఉండటంతో గడువును పెంచాలని కమిటీలు కోరాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details