Telangana Congress PECMeeting Today : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలో పార్టీలన్నీ తమ వ్యూహా, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ.. అలాగే జనాకర్షణ సాధించేందుకు సరికొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది.హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తున్నారు. తామేమి తక్కువ కాదంటూ ఈసారి ఎలాగైనా విజయబావుట ఎగరేయాలని ప్రతిపక్షాలూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections 2023) సన్నాహాలను ముమ్మరం చేసింది.
Congress Strategy for Telangana Assembly Elections 2023 : అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా తమ కార్యకలాపాలకు టీ కాంగ్రెస్ పదునుపెడుతోంది. అభ్యర్ధుల ఎంపికలో కీలక పాత్ర పోషించనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్‌రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మరో 23 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరవుతారు. అదేవిధంగా ఇదే సమావేశంలో స్క్రీనింగ్ కమిటీకి(Congress Screening Committee meeting) చెందిన.. కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిఖీ, విగ్నేష్ మెవానీలు కూడా పాల్గొంటారు. ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగానే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది.