Telangana Congress MLA Tickets Disputes 2023 : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనతో నాయకుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది. మొదటి జాబితాలో ఎక్కువ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు ఉండడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ రెండో జాబితా మాత్రం తీవ్ర ప్రభావం చూపింది. 45 మందితో జాబితా వచ్చినప్పటి నుంచి టిక్కెట్లు రానివారిలో అసమ్మతి పెల్లుబుకుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి చెలరేగుతుందని ముందుగా ఊహించలేదు.
Telangana Congress MLA Candidates Issues : ఇందుకు ప్రధాన కారణం సమఉజ్జీలు ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటం, సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన.. తమకు కాకుండా బయట వాళ్లకు సీట్లు ఇవ్వడంపై పార్టీలో చర్చకు దారి తీసింది. టికెట్ రాని నాయకులు పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుంటే.. ఆ ప్రభావం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై తీవ్రంగా పడుతుందన్న ఆందోళన పార్టీలో ఉంది. ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన జానారెడ్డి సమన్వయ కమిటీతో పాటు ఐదుగురు ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులు కూడా ఓదార్చే పనిలో నిమగ్నమయ్యారు.
నియోజకవర్గాల వారీగా అసమ్మతి నాయకుల జాబితా సిద్ధం చేసుకుని బుజ్జగింపులు చేస్తున్నారు. అసమ్మతి కాంగ్రెస్ నాయకులను బుజ్జగించే కార్యక్రమం పార్టీ సీనియర్ నాయకులు చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తసునీల్ కనుగోలు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, జానారెడ్డి నలుగురు సభ్యుల సమన్వయ కమిటీ, కర్ణాటక మంత్రి బోసురాజు తదితరులు అసంతృప్తి నేతలతో సమావేశమయ్యారు.