Telangana Congress MLA Candidates Third List 2023 :శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాలు మినహా.. అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 55 నియోజకవర్గాలకు.. రెండో జాబితా(Congress Second List)లో 45 నియోజకవర్గాలకు.. మూడో జాబితాలో 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మూడో జాబితా అభ్యర్థులు ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. ఒకవిధంగా చెప్పాలంటే సుదీర్ఘ కసరత్తు చేసిందని చెప్పవచ్చు. చాలా నియోజకవర్గాలలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉండడం.. రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం.. కొత్తగా పార్టీలో చేరికలు ఉండడం తదితర కారణాలతో మూడో జాబితా విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది.
Revanth Reddy Contest From Kamareddy :కాంగ్రెస్ అధిష్ఠానం కూడా మరింత అప్రమత్తమయ్యి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండో జాబితా 45 మందిని ప్రకటించిన సమయంలో పెద్ద ఎత్తున అసంతృప్త జ్వాలలు చెలరేగాయి. వాటిని సకాలంలో అణచి వేయలేకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి గురైన నాయకులు కొందరు పార్టీని వదిలి పెట్టి బయటికి వెళ్లారు. మరి కొంత మంది పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొంత స్తబ్ధత నెలకొంది. తాజాగా నిర్వహించిన సర్వే(Telangana Election Survey 2023)లు కూడా కొన్ని సీట్లు కాంగ్రెస్‌కి తగ్గినట్లుగా వెల్లడించాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. మూడో జాబితాను మరింత అప్రమత్తంగా కేంద్ర ఎన్నికల కమిటీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ మూడో జాబితాలోని అభ్యర్థుల వివరాలు :
- చెన్నూర్ (ఎస్సీ)- డా.జి వివేకానంద
- బోథ్ (ఎస్టీ)- వెన్నెల అశోక్ స్థానంలో గజేందర్
- జుక్కల్ (ఎస్సీ) తోట లక్ష్మీ కాంతారావు
- బాన్సువాడ - ఏనుగు రవీందర్ రెడ్డి
- కామారెడ్డి -రేవంత్ రెడ్డి
- నిజామాబాద్ అర్బన్ - షబ్బీర్ అలీ
- కరీంనగర్ - పురుమళ్ల శ్రీనివాస్
- సిరిసిల్ల - కోదండం కరుణ మహేందర్ రెడ్డి
- నారాయణఖేడ్ - సురేష్ కుమార్ షెట్కర్
- పటాన్‌చెరు - నీలం మధు ముదిరాజ్
- వనపర్తి - తుడి మేఘా రెడ్డి (జిల్లెల చిన్నారెడ్డి స్థానంలో)
- డోర్నకల్ (ఎస్టీ)- డా. రామచంద్రు నాయక్
- ఇల్లెందు (ఎస్టీ) - కోరం కనకయ్య
- వైరా (ఎస్టీ) - కరామదాస్ మాలోత్
- సత్తుపల్లె (ఎస్సీ)- మట్టా రాగమయి
- అశ్వారావుపేట (ఎస్టీ) - జారె ఆదినారాయణ
ఆ రెండు స్థానాలకు అభ్యర్థులు మారారు : ఇలా 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో రెండు నియోజకవర్గాలకు మార్పులు, చేర్పులను చేసింది. వనపర్తి మాజీ మంత్రి చిన్నారెడ్డి స్థానంలో మెగారెడ్డిని.. అదేవిధంగా బోథ్ నుంచి ముందు ప్రకటించిన వెన్నెల అశోక్ బదులు ఆదే గజేందర్‌లను పార్టీ ప్రకటించింది. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా భీమ్ భరత్ ను ప్రకటించిన కాంగ్రెస్ తాత్కాలికంగా పక్కన పెట్టింది. దీంతో ఆ స్థానంలో మరొక అభ్యర్థిని ప్రకటిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆయనపై వస్తున్న అభియోగాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భరత్‌పై ఉన్న వివిధ కేసులను న్యాయ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ఆ నివేదిక వచ్చిన తర్వాతనే హోల్డ్‌లో పెట్టిన అయన.. బీఫామ్(Congress B Forms)ను ఇచ్చే అవకాశం ఉంది.