Telangana Congress MLA Candidates Second List2023: రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధిష్ఠానానికి కత్తి మీద సాములా మారింది. గత ఆదివారం 55 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన ఏఐసీసీ.. మిగిలిన 64 స్థానాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. శనివారం దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు దాదాపు నాలుగు గంటలు సమావేశమయ్యారు. అయినా చాలా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రకటించిన 55 మందిలో పార్టీలోకి కొత్తగా వచ్చిన 12 మందికి టికెట్లు దక్కడం, సర్వేల్లో మెరుగైన ఫలితాలు ఉన్నా.. ఇతరులకు కేటాయించడం, గెలుపు గుర్రాలంటూ పార్టీ కోసం పని చేస్తున్న వారిని నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ఏఐసీసీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
సామాజిక సమీకరణాలు.. తాజా రాజకీయ పరిణామాలు, ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల బలాబలాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని.. పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నా.. అధికార బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో లేకపోవడంతో బయట పార్టీల నుంచి బలమైన నాయకుల కోసం పీసీసీ ఆసక్తి కనపరుస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల బలమైన అభ్యర్థులు లేరన్న వాదన పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో జాబితా ప్రకటనపై పార్టీ లోతుగా విశ్లేషిస్తోంది.
సూర్యాపేటలో దామోదర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఒక వర్గం.. పటేల్ రమేశ్ రెడ్డికి కేటాయించాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వనపర్తి, ఎల్బీనగర్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, మునుగోడు, హుస్నాబాద్, నిజామాబాద్ అర్బన్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక.. ఏఐసీసీకి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. అక్కడ గట్టి పోటీ ఉండటంతో టికెట్ కోసం పట్టుబడుతూ సర్దుబాటు చేసుకొని ముందుకెళ్లే పరిస్థితులు ఆయా నాయకుల్లో లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగాలంటూ ఓ వర్గం.. సీనియారిటీకి పెద్ద పీట వేయాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం.