Telangana Congress MLA Candidates List 2023 :రాష్ట్ర కాంగ్రెస్‌లో మలివిడత అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన కొనసాగుతోంది. మొదటి జాబితాలో ప్రకటించిన 55 నియోజకవర్గాలను పక్కన పెడితే మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా మారింది. ఒకే పేరుతో పాటు రెండు పేర్లు ఉన్న స్థానాలను. కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుధవారం కాంగ్రెస్కేంద్ర ఎన్నికల కమిటీ (Congress Central Election Committee) సమావేశంలో 64 స్థానాలకు దాదాపు 5 గంటల పాటు కసరత్తు కొనసాగింది.
Telangana Congress MLA Candidates Final List :ఇందులో 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 29 నియోజకవర్గాల్లో పోటీదారుల ఎంపికలో కేంద్ర ఎన్నికల కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్లు సమాచారం. బుధవారం జరిగిన సీఈసీ సమావేశంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం వల్ల పార్టీలో ఉన్న నాయకులకు అన్యాయం జరుగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy).. అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట్ల మాత్రమే బయటి నేతలకు టికెట్లు ఇస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
Congress MLA Candidates Second List : 29 నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు సమఉజ్జీలు కావడంతో కేంద్ర ఎన్నికల కమిటీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా గట్టి పోటీ ఉన్న స్థానాల్లో సూర్యాపేట, ఎల్బీనగర్, మునుగోడు, భువనగిరి, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నిజామాబాద్ అర్బన్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. ఈ స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు సీఈసీ కూడా లోతైన కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
బుధవారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత.. కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మరోసారి సమావేశమయ్యారు. వివిధ స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు ముఖ్యులు కావడంతో వారిని బుజ్జగించే కార్యక్రమం కూడా కొనసాగింది. అందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ టికెట్ కోరుతున్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.