Telangana Congress Manifesto 2023 : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. 6 గ్యారంటీలే ప్రధాన అస్త్రంగా దూసుకుపోతున్న హస్తం పార్టీ.. రేపు మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం ఉన్న ఆరు గ్యారంటీలకు అనుబంధంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు మేనిఫెస్టోలో పొందుపర్చారు. ధరణిని తీసేసి, దాని స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెట్టనున్నట్లు అందులో తెలిపారు. ఇంకా మేనిఫెస్టోలో ఏమేం ఉన్నాయంటే..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : రేవంత్రెడ్డి
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే..
- ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల.. పారదర్శకంగా నియామక ప్రక్రియ
- విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం
- బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధుల కేటాయింపు
- మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం
- మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలల పునః ప్రారంభం
- కొత్తగా 4 ట్రిపుల్ ఐటీల ఏర్పాటు
- ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ
- ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి.. మెరుగైన వైద్య సేవలు
- ధరణి స్థానంలో భూమాత పోర్టల్
- భూ హక్కుల సమస్యల పరిష్కరానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు
- పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి హక్కులు
- సర్పంచుల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధుల జమ
- గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏల చెల్లింపు
- సీపీఎస్ రద్దు చేసి.. దాని స్థానంలో ఓపీఎస్ అమల్లోకి
- కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి.. 6 నెలల్లో అమలు