రాహుల్‌గాంధీతో భేటీ కానున్న టీ కాంగ్రెస్ నేతలు T Congress Leaders Delhi Tour : కర్ణాటక తరహాలోనే రాష్ట్రంలోనూ పాగా వేయాలనే కృతనిశ్చయంతో.. కాంగ్రెస్ అధిష్ఠానం పని చేస్తోంది. ఈ కోవలోనే కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతలతో సోమవారం దిల్లీలో పార్టీ అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించనుంది. పీసీసీ సారథి రేవంత్‌రెడ్డి సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో పాటు వారి మద్దతుదారులకు ఆహ్వానం అందింది. ఈ భేటికి రావాలని ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులకు పిలుపు లభించింది.
Ponguleti and Jupally To Join in Congress : జూపల్లి, పొంగులేటి చేరికతో ఎంతోకాలంగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి నష్టం కలగకుండా అధిష్ఠానం ముందు జాగ్రత్తలు తీసుకుంటోందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి మరికొందరు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారు ఆశిస్తున్న ప్రయోజనాల గురించి రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి వివరించినట్లు తెలిసింది.
BRS Leaders to join Congress : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలో చేరికలు తదితర అంశాలపై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం వీరు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించారు. వారి మధ్య రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి పలువురు అగ్రనేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్న తరుణంలో ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి పరిస్థితి ఏంటి?.. వారికి ఎలా న్యాయం చేయాలనే అంశాలు మాట్లాడినట్లు తెలిసింది.
Telangana Congress Leaders To Delhi : జులై 2న ఖమ్మం భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని పొంగులేటి సొంత భూమిలో సభా ఏర్పాట్లు మొదలెట్టారు. భారీగా జన సమీకరణ లక్ష్యంగా.. పొంగులేటి వర్గం నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీలో చేరికకు పొంగులేటి ముమ్మర కసరత్తులు చేస్తున్న వేళ.. కాంగ్రెస్‌లో పలు నియోజకవర్గాల్లో ఆశావహులు తమ టికెట్ పరిస్థితి ఏంటని ఆందోళనలో ఉన్నారు. పొంగులేటి వర్గానికి సీటు ప్రకటిస్తే... తమ రాజకీయ భవితవ్యం ఏంటనే గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ అధిష్ఠానం, ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో హైదరాబాద్, దిల్లీకి ఆశావహ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, వైరా, సత్తుపల్లికి చెందిన నేతలు.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రేవంత్‌ను కలిసి వారి వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఇవీ చదవండి: