Telangana Congress Leaders meets Mallikarjuna Kharge: శ్రీనగర్ ఎయిర్ పోర్టులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు అందరు కలిసికట్టుగా పని చేయాలని నేతలకు మల్లికార్జున ఖర్గే సూచించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్, అనిరుధ్ రెడ్డి, తదితరులు ఖర్గేతో భేటీ అయ్యారు.
దాదాపు రెండు గంటలపాటు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు వివిధ అంశాలపై చర్చించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాకుండా.. పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు పని చేయాలని ఖర్గే స్పష్టం చేశారు. భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేయాలని ఖర్గే సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రాహుల్ ముగింపు సభలో పాల్గొన్న నేతలు :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. జోడో యాత్ర సోమవారం కశ్మీర్‌లో ముగిసిన విషయం తెలిసిందే. కాగా పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆదివారం శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద రాహుల్‌గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వారు రాహుల్‌ను అభినందించారు. ముగింపు సభకు రాష్ట్ర ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా భారత్ జోడోయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జమ్ము కశ్మీర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్డున ఖర్గే, జోడో యాత్ర స్థావరం వద్ద రాహుల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం తన సోదరి ప్రియాంక గాంధీతో రాహుల్ కాసేపు మంచులో సరదాగా అడుకున్నారు. శ్రీనగర్‌లో భారీగా మంచు కురిసినప్పటికీ.. కార్యక్రమం సజావుగా సాగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు. గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఈ ఏడాది జనవరి 30న జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ 12 బహిరంగ సభలు నిర్వహించారు.
ఇవీ చదవండి: