T Congress Leaders Delhi TourToday : కర్ణాటకలో గెలుపుతో మంచి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌లోకి.. ఇప్పటి వరకు నియోజక వర్గ స్థాయి నాయకులు చేరినా.. రాష్ట్రస్థాయి నేతలు మాత్రం చేరలేదు. బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరాలన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ వచ్చారు. కొత్తగా పార్టీ పెట్టేందుకు దాదాపు రెండు నెలలు కసరత్తు చేశారు. అంత తక్కువ సమయంలో పార్టీ పెట్టడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. చివరకు.. కార్యకర్తలు, వారి అనుచరుల సూచనతో బీజేపీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు.
Ponguleti and Jupally To Join in Congress : కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపినా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇటీవలే జూపల్లి, పొంగులేటిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయనను కలిసేందుకు వీలు కాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్‌తో పాటు.. ఇతర అగ్ర నేతలతో సమావేశానికి ముహూర్తం ఖరారైంది. దీంతో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే దిల్లీ వెళ్లారు. పొంగులేటితో పాటు సుమారు 47 మంది అనుచరులు.. జూపల్లితో పాటు మరో 10 నుంచి 12 మంది అనుచరులు మధ్యాహ్నం రాహుల్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశం కానున్నారు.
Telangana Congress Leaders To Delhi : జూపల్లి, పొంగులేటి చేరికను దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులను దిల్లీ రావాలంటూ అధిష్ఠానం ఆహ్వానం పంపింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్‌లతో పాటు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంత్ రావు, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులకు ఆహ్వానం పంపింది. వీరిలో పలువురు ఇప్పటికే హస్తినకు చేరుకోగా.. మరికొందరు ఈ ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు.