తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ సర్కార్‌పై పోరాటం సాగిస్తాం' - Revanth Reddy Latest News

Sankalp Satyagraha initiation at Gandhi Bhavan: రాహుల్‌గాంధీపై అనర్హత వేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ ముక్తకంఠంతో ఖండించింది. బీజేపీ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కక్షతో కేంద్రం ఈ చర్యకు పాల్పడిందని నేతలు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మోదీ సర్కార్‌పై పోరాటం సాగిస్తామని నేతలు నినదించారు.

cong
cong

By

Published : Mar 26, 2023, 2:52 PM IST

Sankalp Satyagraha initiation at Gandhi Bhavan: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సంకల్ప్‌ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట కాంగ్రెస్‌ ఇంఛార్జీ మానిక్‌రావు ఠాక్రేతో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ పాల్గొన్నారు. రాహుల్‌కు కాంగ్రెస్ కుటుంబం అండగా ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జీ మానిక్‌రావ్‌ ఠాక్రే అన్నారు. కాంగ్రెస్‌ బలం ఏంటో చూపెట్టే సమయం ఆసన్నమైందని నేతలకు సూచించారు. భారత్‌ జోడో యాత్రతో రాహుల్ అంటే ఏంటో దేశానికి అర్థం అయిందని పేర్కొన్న ఆయన.. రాహుల్ గాంధీ అంటే బీజేపీకి భయం మొదలయిందని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. తన మిత్రుల కోసం మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 7న నిండు సభలో అదానీ కుంభకోణంపై రాహుల్ బీజేపీ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించడంతో మోదీ ఉక్కిరిబిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపించిందని ఆరోపించారు. బీజేపీ డబుల్ ఇంజిన్.. అదానీ, మోదీ అని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రధాని కుట్ర చేసి అనర్హత వేటు వేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దీక్ష విమరణ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

"ఫిబ్రవరి 7న బీజేపీ ప్రభుత్వాన్ని నిండు సభలో ఆదానీ కుంభకోణంపై ప్రశ్నించారు. దీంతో మోదీ ఉక్కిరి బిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి. బీజేపీ డబుల్ ఇంజన్ ఆదానీ-ప్రధాని. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనపై కుట్ర చేశారు. ప్రధాని రాహుల్ పై కుట్ర చేసి ఆయనపై అనర్హత వేటు వేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్‌ది. హడావిడిగా రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అనర్హుడిగా ప్రకటించింది."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుపడ్డ పరిస్థితి కంటతడి పెట్టేలా ఉందని భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారన్నాని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్త అదానీ గురించి ఎప్పుడు మాట్లాడారో.. అప్పట్నుంచి కేంద్రం ఈ కుట్ర చేసిందని తీవ్రంగా ఆక్షేపించారు. రాహుల్‌గాంధీ ఎక్కడ పార్లమెంట్‌లో అదానీ గురించి మాట్లాడతారో అన్న భయం బీజేపీలో ఉన్న దృష్ట్యా.. ఆగమేఘాలపై పరువు నష్టం కేసులో శిక్షపడేలా చేశారని ధ్వజమెత్తారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా రాజీనామాలు చేసి.. రాహుల్‌పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉద్ధృతం చేయాలని సూచించారు.

"రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడ్డ పరిస్థితి కంటతడి పెట్టేలా ఉంది. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారు. అవసరం అయితే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయాలి. రాహుల్​పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉద్ధృతం చేయాలి. ఇందిరా గాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో.. ఇప్పుడూ అదే జరుగుద్ది".-కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భువనగిరి ఎంపీ

కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి అప్పీల్ చేసుకోవడానికి కోర్టు 30 రోజులు గడువు ఇచ్చిందని.. అయినా హడావిడిగా ఆయన్ను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. కార్యక్రమంలో వీరితో పాటుగా పొన్నాల, వీహెచ్, ఇతర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

"రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. కోలార్‌లో మాట్లాడితే గుజరాత్‌లో కేసు వేశారు. అది తీర్పు ఇచ్చిన జడ్జి పరిధిలోకి రాదు. రాహుల్ గాంధీకి అప్పీల్ చేసుకోవడానికి కోర్టు 30 రోజులు గడువు ఇచ్చింది. అయినా హడావిడిగా రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు". -ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ నల్గొండ

ఇవీ చదవండి:

రాహుల్​ కోసం కాంగ్రెస్ సత్యాగ్రహం.. ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆగదన్న ఖర్గే

'OBCలను అవమానించారు'.. రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా

BRS​కు షాక్​.. తిరిగి సొంతగూటికి చేరిన డీఎస్

ABOUT THE AUTHOR

...view details