Priyanka Gandhi Telangana Tour: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై సమరభేరి మోగించడం ద్వారా యువతను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు పీసీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై... కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయాలల్లో నిరుద్యోగ నిరసన దీక్ష సభలు ఏర్పాటు చేయాలని పీసీసీ పేర్కొంది.
Priyanka Gandhi Telangana Tour news : ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న యువతకు భరోసా కల్పించేట్లు కాంగ్రెస్ పోరాటం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రశ్నపత్రాలు ఏ విధంగా లీక్ అయ్యాయి...? అందుకు బాధ్యులు ఎవరు..? అన్న కోణంలో యువతకు వివరించి.. తద్వారా ఓటర్లను తమవైపు ఆకర్షితులను చేసుకునే దిశలో కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది.
మే మొదటివారంలో రాష్ట్రానికి ప్రియాంక గాంధీ: ప్రధానంగా నిరుద్యోగుల సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై టీపీసీసీ ఉద్యమం చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 21న నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. అదేవిధంగా మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రియాంక గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తుండడంతో... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.