Manikrao thakre Meets T Congress Leaders : వరుస అపజయాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికల పోరు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో సమస్యల పరిష్కారానికి ఆ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మాణిక్కం ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావు ఠాక్రేను రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడిగా నియమించింది.
తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన మాణిక్‌రావు ఠాక్రేకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నాయకులు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్‌తో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని, ఠాక్రేను ఆహ్వానించారు. అనంతరం భారీ ర్యాలీగా గాంధీ భవన్‌కు వెళ్లారు.
వరుస భేటీలతో బిజీ: రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న మాణిక్‌రావ్ ఠాక్రే.. తొలిరోజు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీభవన్‌కు వెళ్లిన ఆయన.. తొలుత ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరీ, నదీం జావేద్‌తో సమావేశమయ్యారు. అనంతరం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పార్టీల పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.