తెలంగాణ

telangana

ETV Bharat / state

congress deeksha: కర్షకులకు మద్దతుగా కాంగ్రెస్​ రెండు రోజులు దీక్ష - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

రాష్ట్రంలో పండిన ధాన్యంలో... ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీ దీక్షకు దిగుతోంది (congress deeksha). కర్షకులకు మద్దతుగా నిలిచేందుకు కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద ఆ పార్టీ నేతలు దీక్ష చేయనున్నారు.

congress protest
congress protest

By

Published : Nov 27, 2021, 5:00 AM IST

congress deeksha: ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనలు తెలుపుతున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్​ దీక్ష చేపట్టనుంది. రెండు రోజుల పాటు ఇందిరాపార్క్​ వద్ద ఆ పార్టీ నేతలు దీక్షలో పాల్గొననున్నారు. ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, సీనియర్‌ నాయకులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు.

ఇవాళ ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు దీక్ష జరగనుంది. శనివారం రాత్రికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో (revanth reddy) పాటు ముఖ్య నాయకులు దీక్షాస్థలివద్దనే బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేయనున్న ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో రైతులను తరలించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపారు.

వేడెక్కుతున్న రాజకీయం

తెలంగాణలో రైతు సమస్యలు కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో తప్పు మీదంటే మీదంటూ తెరాస, భాజపా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ పోరును ఉద్ధృతం చేస్తోంది. రెండు పార్టీల వైఖరిని ఎండగడుతూ... ఇటీవల రైతులతో కలిసి హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వారం రోజులపాటు కల్లాల్లోకి కాంగ్రెస్‌ పేరుతో....రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. బుధ, గురువారం రెండు రోజులు మండల, జిల్లా స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి... మండల రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు.

జంతర్​మంతర్​ వద్ద దీక్ష చేయాలి..

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాన మంత్రి మోదీతో సమావేశం కాకుండానే తిరిగి వచ్చారు. కేసీఆర్ దిల్లీ పర్యటనపై తీవ్రంగా స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... తెలంగాణ సమాజానికి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ దిల్లీ టూర్​... తెరాస, భాజపా మధ్య మ్యాచ్ ఫిక్సింగ్‌గా ఆరోపించారు. రైతు సమస్య పరిష్కారంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... కేసీఆర్.. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు.

అధిష్ఠానానికి లేఖ

వడ్లను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, రైతులు ప్రాణాలు పోతుంటే కేసీఆర్ గుండె కరగడం లేదని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైతులకు మద్దతుగా నిలువాలని భావించిన కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి రెండు రోజుల కిందటనే సోనియాగాంధీకి, రాహుల్‌ గాంధీకి, కేసీ వేణుగోపాల్‌లకు సమగ్ర వివరాలతో లేఖ రాశారు.

ఇదీ చూడండి:congress protest on paddy: కాంగ్రెస్‌ పోరుబాట.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details