Telangana Congress Flash Survey: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొన్ని నియోజకవర్గాలలో క్లిష్టంగా మారింది. గట్టి పోటీనిచ్చే ఇద్దరు సమ ఉజ్జీలున్న దాదాపు 22 నియోజకవర్గాల్లో సర్వేల అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈనెల 20, 21, 22వ తేదీలలో దిల్లీలో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నియోజకవర్గాల వారీగా లోతైన చర్చ జరిగింది. ఇద్దరు గట్టి నాయకులు ఉన్న నియోజకవర్గాలలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. స్క్రీనింగ్ కమిటీ లో ఉన్న సభ్యుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
Congress Focus on Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్
ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ.. ఆయా నాయకులు పార్టీకి చేసిన సేవలు, ప్రజాదరణ, సామాజిక సమీకరణాలు, రాజకీయ స్థితిగతులు తదితర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయాలి. ఇలా జరగాలంటే స్క్రీనింగ్ కమిటీలో ఉన్న సభ్యులంతా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం సభ్యుల మధ్య అది కొరవడినట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఇద్దరు గట్టి నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Telangana Congress MLA Candidates List 2023: గతంలో ఏఐసీసీ చేసిన సర్వేలపైన స్క్రీనింగ్ కమిటీలోని కొందరు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజాగా సర్వేలు నిర్వహించి తద్వారా నిర్ణయం తీసుకోవాలని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నిర్ణయించినట్లు విశ్వసనీయం వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పోటాపోటీగా టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాలు దాదాపు 22 ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సూర్యాపేటలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి-పటేల్ రమేశ్ రెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొంది. వారిద్దరిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించేందుకు స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. అదే విధంగా జనగామలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ కూడా అభ్యర్థి ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది.