Telangana Congress Disputes 2023 :రాష్ట్రంలో 70 నుంచి 80 స్థానాలు కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాతో ఉన్న కాంగ్రెస్.. గత నెలలో సోనియా చేతులో మీదుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా.. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది.
ఇదే ఊపును ఎన్నికలదాకా కొనసాగించి, అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు అంతర్గత పరిణామాలు తలనొప్పిగా మారుతున్నాయి. కొన్ని చోట్ల బలమైన అభ్యర్థుల కొరత, మరికొన్ని చోట్ల టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న తరణంలో కొత్తగా వచ్చే బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు నాయకత్వం కసరత్తులు కొనసాగిస్తోంది. తమను కాదని కొత్తవారికి ప్రాధాన్యత కల్పిస్తూ టికెట్ల హామీ ఇస్తుండటం పట్ల పార్టీని నమ్ముకున్న నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు.
Nandikanti Sridhar resignes Congress: బీఆర్ఎస్లో మంత్రి హరీష్రాశ్తో విబేధాలు తలెత్తి.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. కాంగ్రెస్‌లో చేరారు. తనకు, తనకుమారుడికి రెండు సీట్లు కావాలని మైనంపల్లి కోరగా.. మెదక్ ఇస్తామని.. మల్కాజిగిరి టికెట్ ఇచ్చే అవకాశం లేదని రాష్ట్ర నాయకత్వం చెబుతూ వచ్చింది. కానీ, ఆయన నేరుగా అధిష్ఠానంతో జరిపిన సంప్రదింపులు, ఫ్లాష్ సర్వేలో ఇద్దరికీ అనుకూల పరిస్థితులు ఉండటంతో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ నుంచి మినహాయించి, 2 టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Congress Senior Leaders Resignation Telangana :ఈ నేపథ్యంలో అప్పటి వరకు తనకే టికెట్ వస్తుందని ఆశతో ఉన్న మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానం పెద్దలు నేరుగా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ(RAHUL GANDI) హామీతో దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన.. రెండ్రోజుల పాటు పీసీసీ అధ్యక్షుడితో కలిసి పర్యటనలు సాగించినా.. సోమవారం సాయంత్రం హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అటు, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఖరారైందన్న సమాచారంతో ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు.