T Congress Depends on Karnataka Results : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. క్షేత్ర స్థాయిలో నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు.. ఏదొక కార్యక్రమం పేరుతో జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది.
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచనుంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అన్నదాత సమస్యలతో పాటు యువత సమస్యలపైనా అలుపెరగని పోరాటం చేస్తోంది. అధిక ఓటర్లు కలిగిన ఆ రెండు వర్గాలకు చెందిన డిక్లరేషన్లు ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ మరో ఏడు సామాజికవర్గాలకు చెందిన డిక్లరేషన్ల ప్రకటనకు కసరత్తు చేస్తోంది. ఈ సెప్టెంబర్ 17 నాటికి 9 డిక్లరేషన్ల ప్రకటన పూర్తి చేసి మేనిఫెస్టో విడుదల చెయ్యాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వస్తాయని కాంగ్రెస్ ఎదురు చూస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమాలో నాయకులు:కర్ణాటక ఎన్నికల్లో తెలుగు మాట్లాడే ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు వస్తాయని అక్కడ ఎన్నికల ప్రచారం చేసిన రాష్ట్ర నాయకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లైతే తెలంగాణ కాంగ్రెస్లో నూతనోత్సాహాన్ని ఇవ్వనుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఫలితాలపై టీ కాంగ్రెస్ గంపెడాశలు: ఇటీవల ఓ వివాహ వేదికలో బీజేపీ నేత విజయశాంతి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు పలువురు కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా మరికొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వెళ్లిన నాయకులు మళ్లీ వస్తామని కబురు పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇవాళ్టి కర్ణాటక ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉందని స్థానిక కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇవీ చదవండి: