ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రేపు ఛలో ప్రగతిభవన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఇవాళ వ్యూహరచన చేసింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు దయాసాగర్, ఇతర నేతలు సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఫల్యం చెందారని వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో... సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడి కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు.
ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ వ్యూహం ఖరారు!
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రేపు ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయి ముట్టడి వ్యూహంపై చర్చించారు.
ఆర్టీసీ సీఎండీని నియమించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ... అమలు చేయకుండా న్యాయ వ్యవస్థను పూర్తిగా అగౌరవ పరిచారని ఆరోపించారు. సామాన్య ప్రజల ఇబ్బందులు, ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలందరు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: రేపటినుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలు: అశ్వత్థామరెడ్డి