స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో (local body mlc election) బరిలోకి దిగాలా వద్దా అనే విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (telangana congress) ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్జన భర్జనల అనంతరం నాలుగు చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందులో ప్రధానంగా ఖమ్మం నుంచి నాగేశ్వరరావు, మెదక్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డిని, నిజామాబాద్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వాసుదేవరెడ్డిని పోటీలో నిలపాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
నేడే తేల్చుకోవాలి..
నల్గొండ జిల్లాలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి అక్కడ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో ఇవాళ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. దిల్లీ నుంచి ప్రత్యేక దూత ద్వారా అధిష్ఠానం ఏ ఫారంలు పంపినట్లు సమాచారం. ఈమేరకు ఏడుగురికి బీ ఫారంలు అందజేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు జరుగుతోంది. అభ్యర్థులు బరిలో నిలిస్తే బీఫారంలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.