Telangana Congress Candidates Selection 2023 :రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజుకురోజుకూ పెరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం జోరు అందుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించి బీ-ఫారాలు కూడా అందించి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంది. మరొకవైపు భారతీయ జనతా పార్టీ(BJP) 52 పేర్లతో మొదటి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా పది రోజుల క్రితం 55 పేర్లతో మొదటి జాబితా(Congress MLA Candiadates List)ను ప్రకటించిన కాంగ్రెస్..రెండో జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రతరం చేసింది.
Telangana Congress MLA Candidates Second List 2023 :శని, ఆదివారాలలో దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. ఛైర్మన్ మురళీధరన్, ఇద్దరు సభ్యులు, రేవంత్ రెడ్డి, ఠాక్రే, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహ కర్త సునీల్ కనుగోలు తదితరులు ఉన్నారు. రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు పేర్లను పార్టీ ఎన్నికల కమిటీకి పంపాల్సిన పరిస్థితులు స్క్రీనింగ్ కమిటీ(Congress Screening Committee)లో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
Congress Candidates Second List in Telangana : స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ వచ్చినప్పుడు ప్రతికూల, అనుకూల వర్గాలు గట్టిగా తమ వాదనలను వినిపించి తమకు అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ఎల్బీ నగర్, నర్సాపూర్ తదితర పదికి పైగా నియోజకవర్గాలకు ఇద్దరు సముజ్జీలు ఉండడం, ఏకాభి ప్రాయం కుదరకపోవడంతో ఎటు తేల్చుకోలేని స్క్రీనింగ్ కమిటీ రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు సమాచారం. మొత్తం 64 నియోజకవర్గాలకు చెంది కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాలలో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.