Telangana Congress Candidates Selection 2023 :తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నచందంగా కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, రాజకీయ పరిస్థితులను(Political Conditions) దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగాజరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ కొన్నింటి విషయంలో సర్వేలను పక్కన పెట్టి ఎంపిక చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఇక్కడ సామాజిక సమీకరణాలు(Social Equations) సర్దుబాటు కాకపోవడంతో అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు.. మొదటి విడతలో వచ్చిన పేర్లను పరిశీలిస్తే మేడ్చల్ నియోజక వర్గంలో చాలాకాలంగా హరివర్దన్ రెడ్డి విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఓటర్లకు దగ్గరవుతూ వచ్చారు. సర్వేలను పరిగణనలోకి తీసుకుంటే తనకే టికెట్ దక్కుతుందని అంచనా వేసుకున్నారు. కానీ అక్కడ బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వలేకపోవడంతో.. అన్నింటిని పక్కన పెట్టి సామాజిక సమీకరణాలను ఒక్కదానినే పరిగణనలోకి తీసుకుని తోటకూర జంగయ్య యాదవ్కు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Congress Alliance with Left Parties : మొదటి జాబితా 55 నియోజక వర్గాలను పక్కన పెడితే మిగిలిన 64 నియోజక వర్గాలలో కూడా సామాజిక సమీకరణాలను, రాజకీయ పరిణామాలను, ఆయా నియోజక వర్గాల్లో బరిలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుల(BRS Leaders) శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకుని కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. ఇందుకు స్క్రీనింగ్ కమిటీ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వామపక్షాలు తమకు అనుకూలమైన స్థానాలను కేటాయించాలని పట్టుబడుతుండడంతో.. సీట్ల సర్దుబాటుపై ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Candidates List Delay : అదేవిధంగా కొన్ని నియోజక వర్గాల్లో సమఉజ్జీలు ఉండడంతో అక్కడ .. స్క్రీనింగ్ కమిటీలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సూర్యాపేట విషయంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చి రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఇద్దామని ఒక వర్గం ప్రతిపాదన పెట్టారు. కానీ ఈసారి దామోదర్ రెడ్డికే టికెట్ ఇవ్వలాని పార్టీ నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం, అక్కడ బరిలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుడు మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadeesh Reddy) కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో ఆయనను బలంగా ఢీకొట్టే వాళ్లకే టికెట్ ఇద్దామని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ సూచించారు.