Telangana share in Union Budget 2023-24 : వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రానికి తగిన తోడ్పాటు అందించాలని, బకాయిలు ఇవ్వడంతోపాటు విభజన చట్టం హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఉపాధి హామీ పథకం అమలుపై ఆంక్షలు తొలగించాలని, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు అవసరమైన 8,453 కోట్లకు తగ్గట్లుగా కేంద్ర బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయాలని కోరింది.
Union Budget Session 2023-24: ఆర్థిక సంఘం సిఫారసులు లేకున్నా బడ్జెటేతర అప్పులపై కేంద్రం విధించిన ఆంక్షలను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు వెనకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులు ఇవ్వాలంది. ఐటీఐఆర్‌పై నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా మిషన్ భగీరథ నిర్వహణకు 2,350 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది.
Union Budget 2023-24: ఏపీకి పొరపాటుగా పోయిన 495 కోట్ల సీఎస్ఎస్ నిధులు ఇవ్వాలని కోరింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు చేయాలని కోరుతూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు కూడా రాశారు. పట్టణాభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కోరారు. 6,250 కోట్లతో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోకు మద్దతివ్వాలని, ఎంఆర్టీఎస్ కయ్యే 3,050 కోట్లలో 15 శాతం మూలధన పెట్టుబడిగా 450 కోట్లు ఇవ్వాలని కోరారు.