మొదటి దశ కరోనా ప్రభావంతో 2020-21 ఆర్థిక ఏడాది మొదటి క్వార్టర్లో వాణిజ్య రాబడులు భారీగా పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే రూ. నాలుగు వేలు కోట్లు తగ్గింది. కాని రెండోదశ కరోనా ప్రభావం ఈ ఆర్థిక ఏడాదిలో వాణిజ్య పన్నుల రాబడులపై అంతగా పడలేదు. దీనికి తోడు కేంద్రం నుంచి దాదాపు మూడువేల కోట్లు జూన్, జులై నెలలో జీఎస్టీ పరిహారం వచ్చింది. దీంతో ఈ ఆర్థిక ఏడాది మొదటి క్వార్టర్లో భారీగా వృద్ధి నమోదు అయ్యింది.
2019-20 ఆర్థిక ఏడాదిలో మొదటి క్వార్టర్లో రూ.14,780 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.10,392 కోట్లు, 2021-22 ఆర్థిక ఏడాదిలో పరిహారంతో నిమిత్తం లేకుండా రూ.12,133 కోట్లు ఆదాయం వచ్చింది.
వ్యాట్ రూపంలో...
గత ఆర్థిక ఏడాదిలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై వ్యాట్ రూపంలో మొదటి మూడు నెలల్లో రూ. 911.08 కోట్లు రాబడిరాగా ఈ ఆర్థిక సంవత్సరం అదే సమయంలో రూ.2,957.36 కోట్లు వ్యాట్ రాబడి వచ్చింది. లిక్కర్ విక్రయాలపై వ్యాట్ రాబడి గత ఆర్థిక ఏడాది మొదటి మూడు నెలల్లో రూ.1,425 కోట్లు వ్యాట్ ఆదాయం రాగా ఈ ఆర్థిక సంవత్సరం అదే మొదటి క్వార్టర్లో రూ.2,875.30 కోట్లు వచ్చింది. వస్తు సేవల పన్ను-జీఎస్టీ కింద గత ఆర్థిక ఏడాది మొదటి మూడు నెలల్లో రూ.6,276 కోట్లు రాబడి రాగా... ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రూ12,133 కోట్లు ఆదాయం వచ్చింది.