Telangana CM Puts Hyderabad Airport Metro on Hold :హైదరాబాద్ మెట్రోరైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విస్తరణ ప్రణాళికలు, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు, సంబంధిత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్‌రింగ్ రోడ్డు వెంట ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ రూపొందించడంపై రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. 111 జీవో వల్ల అభివృద్ధికి చాలా తక్కువ అవకాశం ఉండటంతో పాటు ఇప్పటికే మంచి రవాణా సదుపాయం ఉన్న ప్రాంతంలో ఈ అలైన్‌మెంట్ ఎలా రూపొందించారని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో అలైన్‌మెంట్ ప్లాన్, టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మధ్యభాగం, తూర్పు ప్రాంతం, పాతబస్తీలో ఎక్కువ జనాభా ఉన్నందున వారి సౌలభ్యం కోసం మెట్రోరైల్ ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఎంజీబీఎస్- ఫలక్‌నుమా, ఎల్బీనగర్ - చాంద్రాయణగుట్ట ప్రత్యామ్నాయ మార్గాలుగా అలైన్‌మెంట్ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.
CM Revanth Reddy Review On Hyderabad Metro :మైలార్‌దేవులపల్లి, జల్‌పల్లి మీదుగా ఒక ప్రత్యామ్నాయం బార్కాస్, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్ మీదుగా మరో ప్రత్యామ్నాయం రూపొందించాలని మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు. ఒంపులు లేకుండా నేరుగా ఉండే మార్గం ద్వారా వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉండటం వల్ల భారం తగ్గుతుందని సీఎం తెలిపారు. ఎల్ అండ్ టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇచ్చినప్పటికీ పాతబస్తీ ప్రాంతంలోని ఐదున్నర కిలోమీటర్ల మేర మెట్రో రైల్ చేపట్టకపోవడంపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చిన రాయితీ ఒప్పందాలను ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - కేంద్రం నిధులు ఏం చేశారని నిలదీత