తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నాం: కేసీఆర్​ - telangana latest news

ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం.. రైస్​ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

kcr on world food safety day
ప్రపంచ ఆహార దినోత్సవం

By

Published : Jun 7, 2021, 8:17 PM IST

ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ... నేడు దేశానికే అన్నపూర్ణగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో... దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలోకి ఎదుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది తెలంగాణ సమాజం గర్వపడే సందర్భమన్నారు. ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి రాష్ట్రం చేరుకుందన్నారు. రైస్​ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా.. సాగునీరు, తాగునీరు లేక.. అల్లాడిందన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపుకున్నామని.. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మించుకున్నామన్నారు.

తిండికి లోటు ఉండకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఏటా రూ.45 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలకు ఆహార భద్రతతోపాటు సామాజిక జీవన భద్రతనూ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అందుకోసం కుటుంబంలోకి ప్రతీ వ్యక్తికి 6 కిలోల చొప్పున నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుదారులు ఎక్కడినుంచైనా రేషన్ తీసుకొనేలా పోర్టబిలిటీని అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీచూడండి:'దీపావళి వరకు వారికి ఉచిత రేషన్'

ABOUT THE AUTHOR

...view details